Mutual Fund : మ్యూచువల్ ఫండ్స్ గందరగోళం.. 2,500 ఫండ్స్‌లో దేన్ని ఎంచుకోవాలి? నిపుణులు ఏమంటున్నారంటే

Mutual Fund : మ్యూచువల్ ఫండ్స్ గందరగోళం.. 2,500 ఫండ్స్‌లో దేన్ని ఎంచుకోవాలి? నిపుణులు ఏమంటున్నారంటే
X

Mutual Fund : సాధారణ పెట్టుబడిదారులకు, మ్యూచువల్ ఫండ్స్ చాలా సులభమైన, సురక్షితమైన పెట్టుబడి మార్గంగా పరిగణించవచ్చు. ఇందులో రిస్క్ తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ అంటే అనేక మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి, దాన్ని స్టాక్ మార్కెట్లలో, బాండ్లలో, లేదా ఇతర మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం. అయితే భారతదేశంలో ప్రస్తుతం 45కు పైగా మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఉన్నాయి. ఇవి దాదాపు 2,500 కంటే ఎక్కువ ఫండ్ స్కీమ్‌లను నిర్వహిస్తున్నాయి. ఇన్ని రకాల ఫండ్స్‌లో ఏది ఎంచుకోవాలి అనే గందరగోళం ఉండటం సహజం. ఈ గందరగోళాన్ని తొలగించడానికి, మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న రకాలు, వాటి రిస్క్, రాబడి అవకాశాలు తెలుసుకోవడం చాలా అవసరం.

మ్యూచువల్ ఫండ్స్‌ను వాటి పెట్టుబడి వ్యూహం, రిస్క్ ఆధారంగా ప్రధానంగా ఏడు రకాలుగా విభజించారు.. లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్స్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్.

ముందుగా క్యాప్ ఫండ్స్ గురించి చూద్దాం. క్యాప్ అంటే క్యాపిటల్ (పెట్టుబడి). మార్కెట్ విలువ ఆధారంగా కంపెనీలను విభజించి, ఈ ఫండ్స్ పెట్టుబడి పెడతాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ మార్కెట్‌లో అధిక విలువ (దాదాపు రూ.20,000 కోట్ల కంటే ఎక్కువ) ఉన్న పెద్ద కంపెనీల్లో పెడతాయి. కాబట్టి వీటిలో రిస్క్ తక్కువ. మిడ్ క్యాప్ ఫండ్స్ మధ్యస్థాయి కంపెనీల్లో పెట్టుబడి పెడతాయి.. ఇవి భవిష్యత్తులో పెద్ద స్టార్స్‌ అయ్యే అవకాశం ఉన్నందున, కొంచెం ఎక్కువ రిస్క్ ఉన్నా రాబడి ఎక్కువగా ఉండవచ్చు. ఇక స్మాల్ క్యాప్ ఫండ్స్ (రూ.5,000 కోట్ల కంటే తక్కువ విలువ) లో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో అత్యధిక రాబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

హైబ్రిడ్, డెట్ ఫండ్స్ రిస్క్‌ను బ్యాలెన్స్ చేయడానికి లేదా స్థిరమైన ఆదాయం కోసం ఉపయోగిస్తారు. డెట్ ఫండ్స్ ప్రభుత్వ బాండ్లు లేదా కార్పొరేట్ బాండ్ల వంటి స్థిర ఆదాయం ఇచ్చే వాటిలో పెట్టుబడి పెడతాయి. వీటి నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే కొంచెం ఎక్కువ రాబడిని ఆశించవచ్చు. హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీ (షేర్లు), డెట్ (బాండ్లు) రెండింటిలోనూ పెట్టుబడి పెడతాయి. ఇవి డెట్ ఫండ్స్ కంటే ఎక్కువ రాబడిని ఇవ్వగలవు. ఇక ఫ్లెక్సీ / మల్టీ క్యాప్ ఫండ్స్ విషయానికి వస్తే, ఫండ్ మేనేజర్లు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్స్‌లో ఎందులోనైనా తమకు నచ్చినట్లుగా పెట్టుబడి పెడతారు.

చివరిగా మీరు దేన్ని ఎంచుకోవాలి అనేది మీ పెట్టుబడి లక్ష్యం, రిస్క్ తీసుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. తక్కువ కాలం కోసం పెట్టుబడి పెడితే, తక్కువ రిస్క్ ఉన్న డెట్ ఫండ్స్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ మంచిది. దీర్ఘకాలికంగా, ఎక్కువ రిస్క్ తీసుకోగలిగితే స్మాల్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ ఫండ్స్ సరైనవి. ఒకవేళ ఎక్కువ రిస్క్ వద్దనుకుంటే, మధ్యస్థంగా ఉండే లార్జ్ క్యాప్ లేదా ఫండ్ మేనేజర్ పర్యవేక్షణలో ఉండే ఫ్లెక్సీ క్యాప్/మల్టీ క్యాప్ ఫండ్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం.

Tags

Next Story