Flight Ticket Rules : విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. టిక్కెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు క్యాన్సిల్ చేస్తే ఫ్రీ.

Flight Ticket Rules : విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ అదిరిపోయే తీపి కబురు అందించింది. విమాన టిక్కెట్ల బుకింగ్, క్యాన్సిలేషన్, రిఫండ్ విషయంలో ఉన్న నిబంధనలను ప్రయాణికులకు అనుకూలంగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టిక్కెట్ బుక్ చేసిన 48 గంటల లోపు ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే మీ ప్రయాణాన్ని రద్దు చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. దీనిని లుక్-ఇన్ పీరియడ్ అని పిలుస్తారు. అయితే, ఒకవేళ మీరు మార్చుకున్న కొత్త విమానం టిక్కెట్ ధర పాత దానికంటే ఎక్కువగా ఉంటే మాత్రం ఆ వ్యత్యాసాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ 2026 మార్చి 26 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ ఉచిత క్యాన్సిలేషన్ సదుపాయం అందరికీ వర్తించదు, దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. మీరు బుక్ చేసుకున్న విమానం దేశీయ ప్రయాణం అయితే కనీసం 7 రోజుల తర్వాత ఉండాలి. అదే అంతర్జాతీయ ప్రయాణం అయితే కనీసం 15 రోజుల ముందు టిక్కెట్ బుక్ చేసుకోవాలి. అలాగే, ఈ టిక్కెట్‌ను నేరుగా సదరు విమాన సంస్థ వెబ్‌సైట్ నుంచే బుక్ చేసుకుని ఉండాలి. ఒకవేళ 48 గంటల సమయం దాటిపోతే మాత్రం సాధారణ క్యాన్సిలేషన్ ఛార్జీలు వర్తిస్తాయి. అలాగే టిక్కెట్ బుక్ చేసిన 24 గంటల లోపు పేరులో ఏవైనా తప్పులు ఉంటే, వాటిని ఉచితంగా సరిదిద్దుకునే అవకాశం కూడా కల్పించారు.
రిఫండ్ విషయంలో కూడా డీజీసీఏ కఠిన నిబంధనలను పెట్టింది. మీరు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే 7 రోజుల్లోపు, విమాన సంస్థ ఆఫీసులో నగదు చెల్లిస్తే వెంటనే డబ్బును వెనక్కి ఇవ్వాలి. ఒకవేళ మీరు ఏజెంట్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకున్నా, రిఫండ్ ఇచ్చే బాధ్యత విమాన సంస్థదే. ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సిలేషన్ ఛార్జీలు అనేవి బేస్ ఫేర్ మరియు ఇంధన సర్ఛార్జ్ కంటే ఎక్కువగా ఉండకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రయాణికుడికి ఇష్టం లేకుండా రిఫండ్ సొమ్మును క్రెడిట్ షెల్ (తర్వాతి ప్రయాణానికి వాడుకునేలా ఉంచడం)లో పెట్టకూడదు. కస్టమర్ అడిగితేనే అలా చేయాలి.
ఒకవేళ ప్రయాణికుడికి లేదా అతని కుటుంబ సభ్యులకు మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడి టిక్కెట్ రద్దు చేసుకోవాల్సి వస్తే, విమాన సంస్థలు ప్రత్యేక సదుపాయం కల్పించాలి. అటువంటి సమయాల్లో పూర్తి రిఫండ్ లేదా క్రెడిట్ షెల్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, టిక్కెట్ రద్దు చేసినప్పుడు విమాన సంస్థలు బేస్ ఫేర్ రిఫండబుల్ కాకపోయినా, ప్రభుత్వం వసూలు చేసే పన్నులు, ఇతర యూజర్ డెవలప్‌మెంట్ ఫీజులను ఖచ్చితంగా ప్రయాణికుడికి వెనక్కి ఇవ్వాలి. ఈ నిర్ణయంతో విమాన సంస్థల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట పడటమే కాకుండా, సామాన్య ప్రయాణికుడిపై ఆర్థిక భారం తగ్గనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
