Gold Mines : భారత్‌లో కొత్త బంగారు గనులు.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో నిక్షేపాలు గుర్తింపు.

Gold Mines : భారత్‌లో కొత్త బంగారు గనులు.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో నిక్షేపాలు గుర్తింపు.
X

Gold Mines : గత కొంత కాలంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో దేశంలో బంగారానికి ఉన్న అధిక డిమాండ్‌ను కొంతైనా తీర్చడానికి కొత్త ఆశలు చిగురించాయి. 2025లో ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త బంగారు నిక్షేపాలు కనుగొనబడ్డాయి. అయితే, ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న భారతదేశం బంగారు దాహాన్ని ఈ కొత్త నిక్షేపాలు ఎంతవరకు తీర్చగలవు? దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్, దిగుమతులపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అందించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలో బంగారు నిక్షేపాల కోసం అన్వేషణ జరుగుతున్న తరుణంలో 2025లో మూడు ప్రధాన రాష్ట్రాల్లో కొత్త నిక్షేపాలను కనుగొన్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఒడిశాలోని దేవగడ్, కేందుఝర్, మయూర్భంజ్ జిల్లాల్లో సుమారు 1,685 కిలోల బంగారు ముడి ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ప్రాంతంలో లక్షల టన్నుల బంగారు ఖనిజం నిల్వలు ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కూడా బంగారు గని ఉంది. కర్నూలులో భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ గోల్డ్ మైన్ ఉంది. ఇక్కడ సంవత్సరానికి సుమారు 750 కిలోల బంగారం ఉత్పత్తి అవుతోంది.

భారతదేశం బంగారు వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. మన దేశంలో బంగారానికి సాంస్కృతికంగా, ఆర్థికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచ బంగారు మార్కెట్‌లో చైనా అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. చైనా తర్వాత స్థానం భారతదేశానిదే. ఒక నివేదిక ప్రకారం, భారతదేశానికి సంవత్సరానికి దాదాపు 800 టన్నుల బంగారం అవసరం ఉంది. చైనాలో సంవత్సరానికి 815 టన్నుల బంగారం డిమాండ్ ఉంది. ప్రపంచంలో అమ్ముడయ్యే బంగారంలో 50% కంటే ఎక్కువ ఈ రెండు దేశాలే కొనుగోలు చేస్తున్నాయి.

దేశంలో బంగారం ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి అది సరిపోవడం లేదు. భారతదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌లో సుమారు 86% మేర దిగుమతులపైనే ఆధారపడుతున్నట్లు అంచనా. ఈ కొత్త బంగారు గనులు దేశం భారీ స్వర్ణ దాహాన్ని పూర్తిగా తీర్చలేకపోయినా, బంగారం దిగుమతి అవసరాన్ని కొంతమేరకైనా తగ్గించడానికి సహాయపడతాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశమని నిపుణులు భావిస్తున్నారు.

Tags

Next Story