New Income Tax Law : ఏప్రిల్ 1 విడుదల..మారిపోతున్న ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్..గందరగోళానికి చెక్ పెట్టిన ప్రభుత్వం.

New Income Tax Law : భారతదేశంలో ఆదాయపు పన్ను వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణకు తెర లేవబోతోంది. ప్రస్తుతం మనం వాడుతున్న 1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టం రాబోతోంది. అయితే మార్పు సమయంలో పాత ఆదాయం, కొత్త నిబంధనల మధ్య ఎలాంటి ఘర్షణ తలెత్తకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఏప్రిల్ 1, 2026 నుంచి వచ్చే ఆదాయంపై కొత్త చట్టం అమలు అవుతుందని, అంతకంటే ముందు సంపాదించిన దానిపై పాత రూల్సే వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీనివల్ల సామాన్య పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బంది కలగదు.
మార్పు ఎలా ఉంటుంది?
కొత్త చట్టంలో అతిపెద్ద మార్పు ఏమిటంటే, ఇప్పటివరకు మనం వింటున్న ప్రీవియస్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ అనే పదాల స్థానంలో కేవలం ట్యాక్స్ ఇయర్ అనే పదం వస్తుంది. ప్రస్తుతం మీరు సంపాదించిన ఆదాయాన్ని మరుసటి ఏడాది లెక్కించే పద్ధతి ఉంది. కానీ కొత్త సిస్టమ్‌లో ఆదాయం సంపాదించిన కాలం, ట్యాక్స్ రేట్లు, అసెస్‌మెంట్ అన్నీ ఒకే ఏడాది (ట్యాక్స్ ఇయర్) పరిధిలోకి వస్తాయి. దీనివల్ల సాధారణ పౌరులకు ట్యాక్స్ లెక్కలు వేసుకోవడం చాలా సులభం అవుతుంది.
పాత ఆదాయం సేఫ్.. నో డబుల్ ట్యాక్స్
చాలామందిలో ఒకే ఏడాది రెండు రకాల ట్యాక్స్ కట్టాల్సి వస్తుందేమో అన్న భయం ఉంది. దీనిపై ప్రభుత్వం స్పష్టతనిస్తూ.. ఆర్థిక సంవత్సరం 2025-26 ఆదాయాన్ని పాత చట్టం (1961 యాక్ట్) ప్రకారం అసెస్‌మెంట్ ఇయర్ 2026-27లో లెక్కిస్తారని తెలిపింది. అలాగే, ఏప్రిల్ 1, 2026 నుంచి సంపాదించే ఆదాయాన్ని కొత్త చట్టం కింద ట్యాక్స్ ఇయర్ 2026-27లో లెక్కిస్తారు. అంటే కాలక్రమం ఒక్కటే అయినా, ఆదాయం వచ్చే కాలం మరియు దానికి వర్తించే చట్టాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఎక్కడా ఓవర్‌ల్యాప్ లేదా డబుల్ ట్యాక్సేషన్ సమస్య ఉండదు.
చిన్న ట్యాక్స్ ఇయర్ అంటే ఏంటి?
కొత్త నిబంధనల ప్రకారం.. ఒకవేళ ఎవరైనా ఏడాది మధ్యలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినా లేదా కొత్త ఉద్యోగంలో చేరి ఆదాయం పొందడం మొదలుపెట్టినా, వారి ట్యాక్స్ ఇయర్ తక్కువ కాలానికి ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు జూలైలో వ్యాపారం మొదలుపెడితే, జూలై నుంచి మార్చి 31 వరకు ఉన్న కాలమే మీ ట్యాక్స్ ఇయర్‌గా పరిగణించబడుతుంది. ట్యాక్స్ భాషను సరళతరం చేయడమే ఈ మొత్తం మార్పు ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
