Suzuki Burgman : ప్రీమియం లుక్.. అదిరిపోయే టెక్నాలజీ.. కొత్త రంగులో సుజుకి బర్గ్‌మాన్ సందడి.

Suzuki Burgman : ప్రీమియం లుక్.. అదిరిపోయే టెక్నాలజీ.. కొత్త రంగులో సుజుకి బర్గ్‌మాన్ సందడి.
X

Suzuki Burgman : ప్రముఖ టూవీలర్ దిగ్గజం సుజుకి మోటార్ సైకిల్ ఇండియా తన పాపులర్ స్కూటర్ సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 EXలో సరికొత్త మార్పులు చేస్తూ మార్కెట్లోకి వదిలింది. ఈ స్కూటర్‌కు యువతలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ సరికొత్త పెర్ల్ గ్రేస్ వైట్ కలర్ ఆప్షన్‌ను లాంచ్ చేసింది. తెలుపు మరియు గ్రే రంగుల కలయికతో వస్తున్న ఈ కొత్త పెయింట్ స్కీమ్ స్కూటర్‌కు మరింత ప్రీమియం, క్లాసీ లుక్‌ను ఇస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ రంగులకు తోడుగా ఇప్పుడు ఈ వైట్ కలర్ కూడా తోడైంది.

ఫీచర్ల విషయానికి వస్తే.. సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 EX లో రైడర్ సౌకర్యార్థం కంపెనీ అనేక ఆధునిక హంగులను అద్దింది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకుని టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్స్, మెసేజ్ అలర్ట్‌లను నేరుగా స్కూటర్ స్క్రీన్‌పైనే చూడవచ్చు. ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్, గాలి నుంచి రక్షణ కల్పించే విండ్‌స్క్రీన్ ఈ స్కూటర్ ప్రత్యేకతలు. సీటు కింద 21.5 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం వల్ల హెల్మెట్ లేదా ఇతర వస్తువులను భద్రపరచుకోవడం చాలా సులభం అవుతుంది.

ఇంజిన్ సామర్థ్యంలో మాత్రం కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో నమ్మకమైన 124cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8.58 bhp పవర్, 10 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సుజుకి ప్రగతిశీల టెక్నాలజీ అయిన సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ ఆల్ఫా కారణంగా ఈ స్కూటర్ మెరుగైన మైలేజీని ఇస్తుంది. నిశ్శబ్దంగా స్టార్ట్ అయ్యేందుకు సైలెంట్ స్టార్టర్, ట్రాఫిక్‌లో ఆగినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంజిన్ ఆఫ్ అయ్యే ఆటో స్టాప్-స్టార్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు రైడింగ్‌ను మరింత స్మూత్‌గా మారుస్తాయి.

ధర, లభ్యత గురించి చూస్తే.. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,07,902 గా ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సుజుకి డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. సుజుకి సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ ముత్రేజా మాట్లాడుతూ.. బర్గ్‌మాన్ స్ట్రీట్ EX దాని విభిన్నమైన డిజైన్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కారణంగా కస్టమర్ల మనసు గెలుచుకుందని, ఈ కొత్త కలర్ ఆప్షన్ మరింత మందిని ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం సిటీ ప్రయాణాలకే కాకుండా లాంగ్ రైడ్స్ చేసే వారికి కూడా ఈ స్కూటర్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Tags

Next Story