Credit Score : లోన్ కావాలా? టెన్షన్ వద్దు..ఇక వారానికోసారి మీ క్రెడిట్ స్కోర్ అప్‌డేట్.

Credit Score : లోన్ కావాలా? టెన్షన్ వద్దు..ఇక వారానికోసారి మీ క్రెడిట్ స్కోర్ అప్‌డేట్.
X

Credit Score : క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లు తీసుకునే కోట్లాది మంది వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక పెద్ద ఊరట కల్పించింది. సెప్టెంబర్ 29, 2025 న విడుదల చేసిన కొత్త ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. ఇకపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు క్రెడిట్ స్కోర్‌ను ప్రతి వారం అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానుంది.

ప్రస్తుతానికి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు క్రెడిట్ డేటాను ప్రతి 15 రోజులకు ఒకసారి మాత్రమే అప్‌డేట్ చేస్తున్నాయి. దీనివల్ల కస్టమర్లు తమ అప్పులు కట్టేసినా లేదా క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకున్నా, ఆ మార్పు క్రెడిట్ రిపోర్ట్‌లో కనిపించడానికి ఆలస్యం అవుతోంది. ఈ జాప్యం కారణంగా మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ, వారికి తక్కువ వడ్డీకి రుణాలు దొరకడం లేదా క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం వంటి ప్రయోజనాలు అందడం లేదు. ఆర్బీఐ కొత్త నిబంధనల అమలుతో ఈ సమస్యలు తొలగిపోయి క్రెడిట్ వ్యవస్థ వేగవంతమవుతుంది.

ఆర్బీఐ విడుదల చేసిన డ్రాఫ్ట్ ప్రకారం.. క్రెడిట్ కంపెనీలు ప్రతి నెలా 7, 14, 21, 28 తేదీలలో, నెల చివరి రోజున క్రెడిట్ రిపోర్ట్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. బ్యాంకులు ప్రతి నెలా పూర్తి క్రెడిట్ ఫైల్‌ను తదుపరి నెల 3వ తేదీలోపు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు పంపాలి. వారంలో మిగిలిన అప్‌డేట్‌ల కోసం, బ్యాంకులు ఇంక్రిమెంటల్ డేటా(కొత్తగా తెరిచిన లేదా మూసివేసిన అకౌంట్లు, కస్టమర్ చేసిన మార్పులు లేదా అకౌంట్ స్థితి మారిన వివరాలు వంటివి)ను రెండు రోజుల్లోపు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు సమర్పించాలి.

ఏ బ్యాంకైనా ఈ డేటాను నిర్ణీత సమయానికి ఇవ్వడంలో విఫలమైతే, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు వెంటనే ఆర్బీఐ DAKSH పోర్టల్‌లో ఆ విషయాన్ని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ స్కోర్ వారానికి ఒకసారి అప్‌డేట్ కావడం వల్ల రుణ గ్రహీతలకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. వినియోగదారులు తమ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకున్న వెంటనే, ఆ మెరుగైన స్కోర్ త్వరగా రిపోర్ట్‌లో ప్రతిబింబిస్తుంది. దీనివల్ల వారికి వెంటనే, సరైన వడ్డీ రేటుకు లోన్ మంజూరవుతుంది.

చాలా బ్యాంకులు ఇప్పుడు వడ్డీ రేట్లను క్రెడిట్ స్కోర్‌తో ముడిపెట్టాయి. స్కోర్ వేగంగా అప్‌డేట్ కావడం వల్ల, మెరుగైన స్కోర్‌కు అనుగుణంగా వడ్డీ రేటు కూడా త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. మంచి క్రెడిట్ కార్డు ఆఫర్లు, క్రెడిట్ లిమిట్ పెంచే అవకాశాలు త్వరగా లభిస్తాయి. ఈ నిర్ణయం వల్ల బ్యాంకులకు కూడా తాజా, కచ్చితమైన కస్టమర్ క్రెడిట్ డేటా లభిస్తుంది. దీనితో రుణం మంజూరు, రిస్క్ అంచనా ప్రక్రియ మరింత పారదర్శకంగా, కచ్చితంగా మారుతుంది.

Tags

Next Story