Renault Duster 2026 : డస్టర్ ఈజ్ బ్యాక్..రెనాల్ట్ సరికొత్త ఎస్‌యూవీ..ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

Renault Duster 2026 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాపులర్ ఎస్‌యూవీ రెనాల్ట్ డస్టర్ సరికొత్త అవతారంలో మళ్లీ ఇండియన్ రోడ్లపైకి వచ్చేస్తోంది. ఒకప్పుడు ఎస్‌యూవీ అంటే డస్టర్ అనేలా పేరు తెచ్చుకున్న ఈ కారు, ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, అత్యాధునిక ఫీచర్లతో రీ-ఎంట్రీ ఇస్తోంది. మార్చి నెలలో దీని ధరలను అధికారికంగా వెల్లడించనుండగా, ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. అయితే అందరినీ ఆశ్చర్యపరిచే విషయం దీని ప్రారంభ ధర. రెనాల్ట్ ఇండియా తన అత్యంత కీలకమైన మోడల్ డస్టర్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. ఈసారి కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా వంటి దిగ్గజ కార్లకు పోటీగా దీనిని నిలబెడుతోంది. కియా సెల్టోస్ ప్రారంభ ధర రూ.10.99 లక్షలుగా ఉండగా, రెనాల్ట్ మాత్రం తన డస్టర్‌ను అంతకంటే తక్కువ ధరకే, అంటే రూ.9.99 లక్షల వద్ద ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రారంభ ధర తక్కువగా ఉంటే కస్టమర్లు క్యూ కడతారని రెనాల్ట్ నమ్ముతోంది.
ఇంజన్, పర్ఫార్మెన్స్: కొత్త డస్టర్ మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో రానుంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ అత్యంత ప్రజాదరణ పొందుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ బేస్ మోడల్ 100 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇక హై-ఎండ్ వేరియంట్లలో మాన్యువల్, డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. మైలేజీ విషయంలో కూడా ఈ కారు తన సెగ్మెంట్లో బెస్ట్ అనిపించుకోవాలని చూస్తోంది.
డిజైన్, స్టైల్: డస్టర్ తన పాత బాక్సీ లుక్‌ను అలాగే ఉంచుకుంటూనే, ఆధునిక హంగులను అద్దుకుంది. కొత్త హెడ్‌ల్యాంప్‌లు, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, మరింత దృఢంగా కనిపించే బంపర్లు దీనికి స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. కంపెనీ తన కస్టమర్లకు భరోసా ఇచ్చేందుకు ఏకంగా 7 ఏళ్ల వారంటీని ఆఫర్ చేస్తోంది. ఇది వినియోగదారుల్లో కంపెనీపై నమ్మకాన్ని పెంచే అద్భుతమైన ఫీచర్ అని చెప్పాలి.
ఇంటీరియర్, ఫీచర్లు: లోపలి భాగంలో కారు క్యాబిన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. డాష్‌బోర్డ్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంది. టెక్నాలజీ పరంగా 10.2 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి కనెక్టివిటీ ఫీచర్లతో పాటు సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ వంటి ఫీచర్లు ప్రామాణికంగా రానున్నాయి. ఏప్రిల్ నెలలో మీ చేతిలోకి ఈ సరికొత్త డస్టర్ తాళాలు వచ్చే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
