Hyundai Venue : నెక్సాన్, బ్రెజాలకు గట్టి పోటీ.. నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ వెన్యూ వచ్చేస్తోంది.

Hyundai Venue : నెక్సాన్, బ్రెజాలకు గట్టి పోటీ.. నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ వెన్యూ వచ్చేస్తోంది.
X

Hyundai Venue : భారతీయ మార్కెట్‌లో హ్యుందాయ్ నెక్స్ట్ జనరేషన్ వెన్యూ త్వరలో లాంచ్ కానుంది. దీని కొత్త డిజైన్‌కు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. దక్షిణ కొరియాలో తీసిన ఫోటోల ప్రకారం.. రాబోయే వెన్యూ ఇప్పుడు హ్యుందాయ్ ఇతర పెద్ద ఎస్‌యూవీల మాదిరిగా, మరింత ప్రీమియంగా రాబోతుంది. భారత మార్కెట్లో ఈ కారు టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

రాబోయే కొత్త వెన్యూ, ప్రస్తుత మోడల్ కంటే చాలా అద్భుతంగా, ప్రీమియం స్టైల్లో ఉంది. ముఖ్యంగా కారు వెనుక భాగంలో కొత్త క్రెటా, ఆల్కజార్ కార్ల తరహాలో వెడల్పుగా ఉండే ఎల్ఈడీ లైట్ బార్ వస్తుంది. ఇది డ్యూయల్-టోన్ బ్లాక్ ప్యానెల్ లోపల ఉంటుంది. దీనికి రెండు వైపులా మూడు లైటింగ్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. వెనుక బంపర్‌లో భారీ డ్యూయల్-టోన్ క్లాడింగ్ కనిపిస్తుంది. ఇది టెయిల్‌గేట్ వరకు విస్తరించి ఉంది. హ్యుందాయ్ ఇందులో ఎల్-ఆకారపు రిఫ్లెక్టర్లు, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లను కూడా చేర్చింది.

కారు ముందు భాగంలో డిజైన్ మరింత పవర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇది స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ లేఅవుట్‌తో వస్తుంది. పైభాగంలో ఉన్న సన్నని ఎల్ఈడీ స్ట్రిప్ హ్యుందాయ్ ఫ్లాగ్‌షిప్ ఐయోనిక్ 9 ఎస్‌యూవీని గుర్తుచేస్తుంది. కాగా, క్రింద ఉన్న క్వాడ్-బీమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు కొత్త క్రెటా సెటప్‌ను పోలి ఉన్నాయి. గ్రిల్ చాలా పెద్దగా ఉండి, ఇన్సర్ట్‌లతో ఆకర్షణీయంగా ఉంది. ముందు బంపర్ సిల్వర్ స్కిడ్-ప్లేట్ డీటైలింగ్, రెండు మూలల్లో ఎయిర్ వెంట్‌లతో మరింత దృఢంగా కనిపిస్తుంది.

ప్రొఫైల్‌లో ఈ ఎస్‌యూవీ టక్సన్, ఎక్స్‌టర్ మోడళ్లను గుర్తుచేసే విధంగా బోల్డ్ క్యారెక్టర్ లైన్స్, ఫ్లేర్డ్ ఆర్చ్‌లతో కనిపిస్తుంది. సిల్వర్ యాక్సెంట్‌తో కూడిన సి-పిల్లర్, రియర్ క్వార్టర్ గ్లాస్, కొత్త స్టైల్‌లో ఉన్న 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ వెన్యూ విజువల్ అపీల్‌ను పెంచుతున్నాయి. ఇంటీరియర్‌లో కొత్త వెన్యూ డిజైన్, టెక్నాలజీ పరంగా ముందడుగు వేసినట్లు భావిస్తున్నారు. దీనిలో కొత్త క్రెటా మాదిరిగా లేఅవుట్ కలిగిన ట్విన్-స్క్రీన్ సెటప్‌తో కూడిన పూర్తిగా కొత్త డ్యాష్‌బోర్డ్ ఉండవచ్చు.

హ్యుందాయ్ ఈ కారులో కొత్త స్విచ్‌గేర్, కొత్త డిజైన్ స్టీరింగ్ వీల్, మెరుగైన కేబిన్ మెటీరియల్‌ను అందించే అవకాశం ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సాఫ్ట్‌వేర్, డిజిటల్ క్లస్టర్ వంటివి ఉండవచ్చు. అయితే, ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కొత్త వెన్యూలో కూడా ప్రస్తుత మోడల్‌లో ఉన్న మూడు ఇంజిన్ ఆప్షన్లు మాత్రమే లభించే అవకాశం ఉంది.

Tags

Next Story