Stock Market : ముప్పై ఏళ్లు.. మూడు భారీ కుదుపులు.. అయినా వెనక్కి తిరిగి చూడని భారత స్టాక్ మార్కెట్.

Stock Market : ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, చమురు ధరల సెగతో భారత స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. కేవలం ఒకే వారంలో నిఫ్టీ దాదాపు 8 శాతం పడిపోవడంతో ఇన్వెస్టర్లు కంగారు పడుతున్నారు. అయితే, ఇలాంటి సంక్షోభాలు మార్కెట్ కు కొత్తేమీ కాదని, ప్రతి పతనం తర్వాత మార్కెట్ మరింత బలంగా పైకి లేస్తుందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ స్పష్టం చేసింది. ఎన్ఎస్ఈ తన 30 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన నిఫ్టీ 50 - భారత మార్కెట్ వృద్ధికి 30 ఏళ్లు అనే శ్వేతపత్రంలో గత రెండు దశాబ్దాల్లో మార్కెట్ ఎదుర్కొన్న మూడు ప్రధాన సవాళ్లను వివరించింది.
1. 2000-2002: టెక్ బబుల్ పేలిన వేళ
దాదాపు 25 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ కంపెనీల హవా పెరిగి డాట్ కామ్ బబుల్ ఏర్పడింది. అది పేలినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ఆ సమయంలో నిఫ్టీ 50 తన గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 51 శాతం నష్టపోయింది. కానీ, భారత ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ, కేవలం మూడేళ్లలోనే అంటే 2005 నాటికే ఆ నష్టాలన్నిటినీ పూడ్చుకుని సరికొత్త రికార్డులను సృష్టించింది. సంక్షోభంలో ధైర్యంగా ఉన్న వారికే అప్పుడు లాభాలు దక్కాయి.
2. 2008: ప్రపంచ ఆర్థిక సంక్షోభం
అమెరికాలో హౌసింగ్ లోన్ల కుంభకోణం వల్ల లెమాన్ బ్రదర్స్ వంటి దిగ్గజ బ్యాంకులు దివాళా తీశాయి. దీనివల్ల నిఫ్టీ చరిత్రలోనే అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. కేవలం కొన్ని నెలల్లోనే ఇండెక్స్ 59 శాతం కుప్పకూలింది. కానీ, ఆశ్చర్యకరంగా 2013 నాటికి నిఫ్టీ తన పాత రికార్డులన్నిటినీ బద్దలు కొట్టి దూసుకెళ్లింది. మార్కెట్ లో దీర్ఘకాలం పాటు ఉన్న ఇన్వెస్టర్లు ఈ సమయంలోనే భారీగా సంపాదించారు.
3. 2020: కోవిడ్-19 పిడుగు
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం లాక్ డౌన్ లోకి వెళ్ళినప్పుడు, కొద్ది వారాల్లోనే నిఫ్టీ 37 శాతం పడిపోయింది. ఇది చరిత్రలోనే అత్యంత వేగవంతమైన పతనం. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపనలు, చిన్న ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో మార్కెట్ V-షేప్ రికవరీని సాధించింది. కేవలం ఏడాది కాలంలోనే అంటే 2021 మార్చి నాటికి, మార్కెట్ తన కనిష్ట స్థాయి నుంచి రెట్టింపు పెరిగి అందరినీ విస్మయానికి గురిచేసింది.
నిఫ్టీ మాస్టర్ ప్లాన్.. ఇన్వెస్టర్లకు గుణపాఠం:
NSE విశ్లేషణ ప్రకారం, గత 30 ఏళ్లలో (1995 నుంచి 2026 వరకు) నిఫ్టీ 50 ఏటా సగటున 12.74 శాతం రిటర్న్స్ ఇచ్చింది. మరీ ముఖ్యంగా, చరిత్రలో ఏ 7 ఏళ్ల లేదా 10 ఏళ్ల కాలవ్యవధిని తీసుకున్నా నిఫ్టీ ఎప్పుడూ నెగటివ్ రిటర్న్స్ ఇవ్వలేదు. అంటే, మార్కెట్ లో ఓపికగా కనీసం 7 ఏళ్లు ఇన్వెస్ట్ చేసిన ఎవరికీ నష్టం రాలేదు. ప్రస్తుతం యుద్ధ భయాలతో మార్కెట్ పడిపోతుండటం తాత్కాలికమేనని, సంక్షోభ సమయంలో షేర్లను అమ్మేస్తే నష్టం ఖాయమని, అదే పట్టుదలతో ఉంటే భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
