Nirmala Sitharaman : మొరార్జీ దేశాయ్ రికార్డుకు చేరువలో నిర్మలా సీతారామన్.. ఫిబ్రవరి 1న దేశం చూపు ఆమె వైపే.

Nirmala Sitharaman : భారతదేశ మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్, తన పనితీరుతోనే కాకుండా రికార్డులతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. ఫిబ్రవరి 1, 2026న ఆమె తన వరుసగా 9వ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. గతంలో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గరిష్టంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు నిర్మలమ్మ ఆ రికార్డుకు కేవలం ఒక అడుగు దూరంలో నిలిచారు. అయితే వరుసగా అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మాత్రం ఆమెకే దక్కుతుంది.
మన దేశ ఆర్థిక రంగాన్ని శాసించిన ఎందరో దిగ్గజ మంత్రుల రికార్డులను నిర్మలా సీతారామన్ అధిగమించారు. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా (వేర్వేరు కాలాల్లో), ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు పద్దులు సమర్పించారు. అలాగే ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్ వరుసగా 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. వీరందరినీ దాటుకుంటూ నిర్మలా సీతారామన్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 2019లో మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆమెకు ఈ కీలక బాధ్యత అప్పగించారు. అప్పటి నుంచి నేటి వరకు ఆమె వెనుదిరిగి చూడలేదు.
బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు
సుదీర్ఘ ప్రసంగం: పార్లమెంటు చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు నిర్మలమ్మదే. ఫిబ్రవరి 1, 2020న ఆమె రెండు గంటల 40 నిమిషాల పాటు మాట్లాడారు. చివరి రెండు పేజీలు చదవడానికి ఓపిక లేక ఆమె తన ప్రసంగాన్ని ముగించాల్సి వచ్చింది.
చిన్న ప్రసంగం: అత్యంత చిన్న బడ్జెట్ ప్రసంగం రికార్డు 1977లో హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ పేరిట ఉంది. ఆయన కేవలం 800 పదాలతో ప్రసంగాన్ని ముగించారు.
సమయం మారింది: బ్రిటిష్ కాలం నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. కానీ 1999లో వాజ్‌పేయి ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా ఈ ఆచారాన్ని మార్చి ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు.
తేదీ మారింది: 2017 వరకు ఫిబ్రవరి నెలాఖరున వచ్చే బడ్జెట్‌ను, అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు. దీనివల్ల ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి నిధుల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది.
డిజిటల్ విప్లవం - బహీ ఖాతా: నిర్మలా సీతారామన్ సంప్రదాయ బడ్జెట్ సూట్‌కేస్‌ను పక్కనపెట్టి, ఎర్రటి క్లాత్‌లో చుట్టిన బహీ-ఖాతాను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కాలక్రమేణా మేడ్ ఇన్ ఇండియా ట్యాబ్లెట్ ద్వారా డిజిటల్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు. ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు పన్ను ఉపశమనం కలుగుతుందా? మౌలిక సదుపాయాలకు ఎన్ని కోట్లు కేటాయిస్తారు? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా, ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలమ్మ చేసే ప్రసంగం భారత ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిగా మారబోతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
