Nissan Magnite : ఆఫ్రికా నుంచి అమెరికా దాకా..ఈ కారు కోసం క్యూ కడుతున్న విదేశీయులు.

Nissan Magnite : భారత ఆటోమొబైల్ రంగానికి 2025 సంవత్సరం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. జీఎస్టీ తగ్గింపులు, పండుగ సీజన్ అమ్మకాలతో దేశీయ మార్కెట్ కళకళలాడింది. అయితే, విదేశాలకు కార్ల ఎగుమతుల విషయంలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 2024 డిసెంబర్‌తో పోలిస్తే 2025 డిసెంబర్‌లో కార్ల ఎగుమతులు 9.36 శాతం తగ్గి 69,100 యూనిట్లకు పరిమితమయ్యాయి. కానీ ఈ నిరాశలోనూ ఒక కారు మాత్రం రాకెట్లా దూసుకెళ్లి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అదే నిస్సాన్ మాగ్నైట్.
భారతదేశం ఇప్పుడు కేవలం కార్లను కొనే దేశం మాత్రమే కాదు, ప్రపంచానికి కార్లను ఇచ్చే దేశంగా మారుతోంది. మేక్ ఇన్ ఇండియా.. మేక్ ఫర్ ద వరల్డ్ అనే నినాదంతో తయారైన నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. 2025 డిసెంబర్ గణాంకాలను పరిశీలిస్తే, మాగ్నైట్ ఎగుమతులు ఏకంగా 260.62 శాతం పెరిగాయి. గత ఏడాది కేవలం 2,570 యూనిట్లు ఎగుమతి కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 9,268కి చేరింది. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలోని సుమారు 65 దేశాలకు ఈ కారు మన దేశం నుంచి వెళ్తోంది. ఎడమ వైపు, కుడి వైపు స్టీరింగ్ ఉన్న రెండు వెర్షన్లలోనూ ఇది లభ్యమవుతుండటం దీనికి పెద్ద ప్లస్ పాయింట్.
మరోవైపు భారత కార్ల ఎగుమతుల్లో మారుతి సుజుకి 36.8 శాతం వాటాతో ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. అయితే మారుతికి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్విఫ్ట్, ఫ్రాంక్స్, బాలెనో వంటి పాపులర్ మోడళ్ల ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే మారుతి ఎగుమతుల గ్రాఫ్ కిందికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మారుతికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ వల్ల నంబర్ వన్ స్థానం దక్కినా, నిస్సాన్ మాగ్నైట్ లాంటి సింగిల్ మోడల్ చూపిస్తున్న వృద్ధి రేటును మారుతి అందుకోలేకపోయింది.
ఇక హ్యుందాయ్ విషయానికి వస్తే.. ఈ సంస్థ ఎగుమతుల్లో పక్కాగా నంబర్ 2 స్థానంలో నిలిచింది. వెర్నా సెడాన్, i10 ఫ్యామిలీ కార్ల షిప్‌మెంట్స్ పెరగడం హ్యుందాయ్‌కు కలిసొచ్చింది. సబ్-4 మీటర్ ఎస్‌యూవీల విభాగంలో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ పెరగడం భారతీయ తయారీదారులకు వరంగా మారింది. టయోటా, కియా మోడళ్లు కూడా స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. అయితే ఫోక్స్‌వ్యాగన్ సంస్థకు మాత్రం ఈ ఏడాది చేదు అనుభవమే మిగిలింది. టైగూన్, వర్టస్ వంటి కార్ల ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి.
మొత్తానికి 2025 డిసెంబర్‌లో భారత మొత్తం ఎగుమతులు 69,100 యూనిట్లకు పడిపోయినా, నిస్సాన్ మాగ్నైట్ సాధించిన విజయం మాత్రం ఆటోమొబైల్ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దేశీయంగా మాగ్నైట్ కొత్త వెర్షన్ లాంచ్ కావడం, అప్‌డేటెడ్ ఫీచర్లతో విదేశీ మార్కెట్లలోకి వెళ్లడం నిస్సాన్‌కు కలిసొచ్చిన అంశాలు. భవిష్యత్తులో ఈ ఎగుమతుల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
