Viacom18 : వయాకామ్ బోర్డులోకి నీతా, ఆకాశ్ అంబానీ

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీకి చెందిన మీడియా వ్యాపారాల విలీనంలో మరో ముందడుగు పడింది. విలీనం నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ.. వయాకామ్ 18 బోర్డులో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వయాకామ్ 18 అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ సిస్టమ్స్‌కు చెందిన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగం. ప్రతిపాదిత విలీనానికి ఇప్పటికే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్ సీఎల్ టీ) ఆమోద ముద్ర వేశాయి. సీసీఐ సూచనల మేరకు వ్యాపారంలో చిన్నపాటి మార్పులు మినహా ఇప్పటికే విలీన ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ క్రమంలో తల్లీ, కుమారులు బోర్డులో చేరడం గమనార్హం. వీరితో పాటు బోధి ట్రీ సిస్టమ్స్ కో ప్రమోటర్ జేమ్స్ ముర్దోచ్, కతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి చెందిన మహ్మద్ అహ్మద్ అల్ హర్దన్, రిలయన్స్‌లో మీడియా, కంటెంట్ వ్యాపార విభాగం ప్రెసిడెంట్ జ్యోతి దేశ్ పాండే, శువా మొండల్ తదితరులు వయాకామ్ 18 బోర్డులో నియమితులయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com