NPS: పెన్షన్ కోసం ఒక అకౌంట్.. డబ్బుల కోసం ఇంకో అకౌంట్.. టైర్-1, టైర్-2 మధ్య తేడాలు తెలుసా?

NPS: నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ఈ రోజుల్లో చాలా మందికి మంచి పెట్టుబడి ఆప్షన్‌గా మారింది. ఇది ఒకేసారి పెట్టుబడి, పెన్షన్ అనే రెండు లక్ష్యాలను నెరవేరుస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఎన్‌పీఎస్‌లో కొన్ని రూల్స్ మార్చింది. దీని తర్వాత, ఇది దాదాపు మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) లాగే మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. ఎన్‌పీఎస్‌లో సాధారణంగా రెండు రకాల అకౌంట్లు ఉన్నాయి. అవి టైర్-1, టైర్-2 అకౌంట్స్.
టైర్-1 అకౌంట్
ఎన్పీఎస్లోని టైర్-1 అకౌంట్‌ను కేవలం పెన్షన్ లక్ష్యంతోనే తెరుస్తారు. దీనిలో పెట్టిన డబ్బును రిటైర్మెంట్ అయ్యే వరకు, అంటే 60 సంవత్సరాలు వచ్చే వరకు వెనక్కి తీసుకోవడానికి వీలు ఉండదు. 60 ఏళ్లు వచ్చాక ఈ అకౌంట్‌లో ఉన్న డబ్బులో 60 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 శాతం డబ్బుతో తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాలి. ఈ యాన్యుటీ ప్లాన్ నుంచే పెట్టుబడిదారుడికి ప్రతీ నెలా పెన్షన్ వస్తుంది. ఈ టైర్-1 అకౌంట్‌లో మీ డబ్బును ఈక్విటీ(స్టాక్ మార్కెట్) లో 75 శాతం కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి వీలు లేదు. మిగిలిన డబ్బును తప్పనిసరిగా బాండ్లు వంటి డెట్ అసెట్స్‌లో పెట్టాలి. అందుకే ఇందులో రిస్క్ తక్కువ, కానీ రిటర్న్ కూడా కొంత తక్కువగానే ఉంటుంది.
టైర్-2 అకౌంట్
ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టే ప్రతి ఒక్కరూ టైర్-1 అకౌంట్ తెరవడం తప్పనిసరి. అయితే, కావాలనుకుంటే దానితో పాటు టైర్-2 అకౌంట్‌ను కూడా తెరవడానికి అవకాశం ఉంటుంది. ఈ టైర్-2 అకౌంట్ ఒక రకంగా మ్యూచువల్ ఫండ్ లాగా పనిచేస్తుంది. టైర్-2 లో పెట్టిన డబ్బును ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత వెనక్కి తీసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. రిటైర్మెంట్ వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు పెట్టిన డబ్బును 100 శాతం వరకు కూడా ఈక్విటీ (షేర్ మార్కెట్)లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో రిటర్న్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
ఎన్‌పీఎస్‌లో తక్కువ ఖర్చుతో ఎక్కువ రిటర్న్స్
మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే ఎన్‌పీఎస్‌లో ఉన్న అతి పెద్ద ఆకర్షణ, దాని నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉండటం. మ్యూచువల్ ఫండ్స్‌లో నిర్వహణ ఖర్చు దాదాపు 1 శాతం వరకు ఉంటుంది. కానీ ఎన్‌పీఎస్‌లో ఈ ఎక్స్‌పెన్స్ రేషియో 0.1 శాతం కంటే కూడా తక్కువగా ఉంటుంది. దీనివల్ల పెట్టుబడిదారులకు ఎక్కువ రిటర్న్స్ దక్కడానికి అవకాశం ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఎన్పీఎస్లోని ఈక్విటీ ప్లాన్స్‌ను చూస్తే, అవి దీర్ఘకాలంలో సగటున 10 నుంచి 12 శాతం వరకు రిటర్న్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పెట్టుబడి, పెన్షన్ కోసం ఎన్పీఎస్ ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

