Ola : రూపాయి ఖర్చు లేకుండా రూ. 2,000 కోట్లు.. ఓలా బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేసే మాస్టర్ ప్లాన్.

Ola : రూపాయి ఖర్చు లేకుండా రూ. 2,000 కోట్లు.. ఓలా బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేసే మాస్టర్ ప్లాన్.
X

Ola : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. తన బ్యాటరీ తయారీ విభాగమైన ఓలా సెల్ టెక్నాలజీస్ లో కొంత వాటాను విక్రయించడం ద్వారా సుమారు రూ.2,000 కోట్లు సేకరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ నిధుల సేకరణ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు ఎవెండస్ క్యాపిటల్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు అప్పగించారు. కంపెనీ తన బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేసుకోవడంతో పాటు, దేశీయంగా బ్యాటరీల తయారీ, ఇంధన నిల్వ సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి సారించింది.

ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఓలా లిథియం-అయాన్ బ్యాటరీ సెల్ ప్లాంట్ (గిగాఫ్యాక్టరీ) సామర్థ్యం 1.5 GWh గా ఉంది. దీనిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 6 GWh కి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వాటాల విక్రయం ద్వారా ఓలా బ్యాటరీ ప్రాజెక్ట్ మార్కెట్ విలువ ఎంత అనేది స్పష్టమవుతుంది. ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు, సావరీన్ వెల్త్ ఫండ్‌లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.3,500 కోట్ల ప్రారంభ పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంట్, బ్యాటరీల దిగుమతులపై చైనా వంటి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఓలా తన బ్యాటరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‎లో కూడా దూసుకుపోతోంది. ఓలా బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్‌లో 200 మందికి పైగా నిపుణులు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విభాగం కింద 400 పేటెంట్లను కంపెనీ సొంతం చేసుకుంది. నికెల్-మాంగనీస్-కోబాల్ట్‎తో పాటు లిథియం-ఐరన్-ఫాస్ఫేట్ వంటి అత్యాధునిక బ్యాటరీ టెక్నాలజీలపై ఇక్కడ పని జరుగుతోంది. భవిష్యత్తులో కేవలం టూవీలర్లకే కాకుండా, కమర్షియల్ ఎనర్జీ స్టోరేజ్ అవసరాల కోసం కూడా బ్యాటరీలను తయారు చేయాలని ఓలా భావిస్తోంది.

భారతదేశం 2030 నాటికి తన విద్యుత్ ఉత్పత్తిలో 50% పునరుత్పాదక ఇంధనం ద్వారా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సౌర, పవన విద్యుత్ నిల్వ చేయడానికి భారీ బ్యాటరీల అవసరం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఒడిసి పట్టేందుకు ఓలా ఇప్పటికే గృహ అవసరాల కోసం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు వాటాల విక్రయం ద్వారా వచ్చే నిధులతో కమర్షియల్ రంగంలో కూడా విస్తరించి, దేశీయ బ్యాటరీ మార్కెట్లో అగ్రగామిగా ఎదగాలని ఓలా గట్టి పట్టుదలతో ఉంది.

Tags

Next Story