Bajaj Pulsar Bikes : భారత టూ-వీలర్ మార్కెట్లో బజాజ్ సునామీ.. 8 పల్సర్లు ఒకేసారి దిగుతున్నాయి.

Bajaj Pulsar Bikes : భారత టూ-వీలర్ మార్కెట్లో బజాజ్ సునామీ.. 8 పల్సర్లు ఒకేసారి దిగుతున్నాయి.
X

Bajaj Pulsar Bikes : బజాజ్ పల్సర్ అభిమానులకు అదిరిపోయే వార్త. భారతీయ రోడ్లపై యువతకు ఫేవరెట్ బైక్‌గా గుర్తింపు పొందిన పల్సర్ సిరీస్‌లో రాబోయే కొన్ని నెలల్లో భారీ మార్పులు జరగనున్నాయి. బజాజ్ ఆటో తన పల్సర్ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ, మే 2026 నాటికి ఏకంగా 8 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. కేవలం గ్రాఫిక్స్ మార్పులు మాత్రమే కాకుండా, ఈసారి ఇంజిన్, డిజైన్, టెక్నాలజీ పరంగా కూడా భారీ అప్‌డేట్స్ ఉండబోతున్నాయి.

బజాజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ ఇటీవలి ప్రకటన ప్రకారం.. వచ్చే 4 నెలల్లో (మే 2026 లోపు) మొత్తం 8 పల్సర్ మోడళ్లు అప్‌డేట్ కానున్నాయి.

క్లాసిక్ సిరీస్ (OG Pulsar): పల్సర్ 125, 150, 220F మోడళ్లు పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్ మీద రాబోతున్నాయి. వీటిలో ప్రస్తుతం ఉన్న ట్విన్ షాక్ అబ్జార్బర్ల స్థానంలో మోనోషాక్ సస్పెన్షన్, కొత్త ఛాసిస్‌ను అమర్చే అవకాశం ఉంది.

NS సిరీస్: పల్సర్ NS125, NS160, NS200 బైక్‌లకు సరికొత్త లుక్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు తోడవుతాయి.

N సిరీస్: N125, N160, N250 మోడళ్లలో కూడా కొన్ని చిన్నపాటి కాస్మెటిక్ మార్పులు ఉండవచ్చు.

పల్సర్ లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన NS400Z విషయంలో బజాజ్ ఒక వ్యూహాత్మక మార్పు చేసే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఈ బైక్ 373cc ఇంజిన్‌తో వస్తోంది, దీనిపై 28% GST పడుతోంది. అయితే ధరను మరింత తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు దీనిని 350cc కంటే తక్కువకు తగ్గించి, 18% GST బెనిఫిట్ పొందేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల కస్టమర్లకు ఈ పవర్‌ఫుల్ బైక్ తక్కువ ధరకే లభిస్తుంది.

కొత్తగా రాబోయే పల్సర్ బైక్‌లలో కేవలం ఇంజిన్ మార్పులే కాకుండా, నేటి తరం యువత కోరుకునే ఆధునిక ఫీచర్లను జోడిస్తున్నారు. హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ అన్నీ పూర్తి LED వెర్షన్‌లో రాబోతున్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లతో కూడిన డిజిటల్ డిస్‌ప్లేలు టాప్ వేరియంట్లలో ఉండనున్నాయి. ధరల విషయంలో కస్టమర్లకు ఊరటనిచ్చేలా బజాజ్ తన 125cc, 150cc సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేస్తోంది.

ప్రస్తుతం పల్సర్ సిరీస్ ధరలు సుమారు రూ.81,000 నుంచి ప్రారంభమై రూ.1.94 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. కొత్త అప్‌డేట్స్ వల్ల వేరియంట్‌ను బట్టి రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ధర పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 2026 మోడల్ పల్సర్ 125, 150 షోరూమ్‌లకు చేరుకోవడం ప్రారంభించాయి. మార్చి, మే నెలల్లో మరిన్ని కీలక లాంచ్‌లు ఉండబోతున్నాయి.

Tags

Next Story