Electric Cars : ఎలక్ట్రిక్ కార్ల వార్ షురూ.. పంచ్ ఈవీకి పోటీగా ఉన్న ఆ 4 కార్లు ఏవి? ఏది కొంటే లాభం?

Electric Cars : భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేనంత జోరుగా సాగుతోంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్లు అంటే కేవలం ధనవంతులకే పరిమితం అనుకునేవారు, కానీ ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ రేసులో టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసి మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే, పంచ్ ఈవీకి మార్కెట్లో పోటీ తక్కువేమీ లేదు. దీనికి గట్టి పోటీ ఇస్తున్న సిట్రోయెన్ ఈసీ3, టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ. మహీంద్రా XUV 3XO ఈవీ కార్ల మధ్య అసలు తేడాలేంటో, ఏది కొంటే బెస్ట్ ఆప్షనో వివరంగా తెలుసుకుందాం.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 9.69 లక్షల నుంచి ప్రారంభమై రూ. 14.44 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అయితే ఇందులో BaaS (బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్) అనే కొత్త ఆప్షన్ కూడా ఉంది. దీని కింద కారు ధర కేవలం రూ. 6.49 లక్షలకే లభిస్తుంది, కానీ బ్యాటరీ రెంట్ కింద కిలోమీటరుకు రూ. 2.6 చెల్లించాల్సి ఉంటుంది. ఇది 30 kWh, 40 kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 468 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
సిట్రోయెన్ eC3
మీరు పంచ్ ఈవీకి ప్రత్యామ్నాయం కోసం చూస్తుంటే, సిట్రోయెన్ eC3 ఒక మంచి ఆప్షన్. దీని ధర రూ. 12.90 లక్షల నుంచి రూ. 13.41 లక్షల మధ్య ఉంటుంది. ఇందులో 29.2 kWh బ్యాటరీ ఉంటుంది, ఇది 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఏసీ, డీసీ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేసే ఈ కారు, సిటీలో తిరగడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. పంచ్ తో పోలిస్తే దీని రేంజ్ కొంచెం తక్కువైనా, ధర విషయంలో గట్టి పోటీ ఇస్తుంది.
టాటా నెక్సాన్ ఈవీ
పంచ్ కంటే కొంచెం పెద్ద కారు, ఎక్కువ ఫీచర్లు కావాలనుకునే వారికి టాటా నెక్సాన్ ఈవీ సరైన ఎంపిక. దీని ధర రూ. 12.49 లక్షల నుంచి రూ. 17.49 లక్షల వరకు ఉంటుంది. ఇది 30 kWh, 45 kWh బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. నెక్సాన్ ఈవీ ఏకంగా 489 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. సేఫ్టీ, ర్మెన్స్ విషయంలో నెక్సాన్ ఈవీ ఇప్పటికీ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది.
ఎంజీ విండ్సర్ ఈవీ, మహీంద్రా XUV 3XO ఈవీ
ఎంజీ విండ్సర్ ఈవీ బాస్ పద్ధతిలో రూ. 9.99 లక్షలకే లభిస్తోంది, మామూలుగా అయితే రూ. 14 లక్షల నుంచి రూ. 18.50 లక్షల వరకు ఉంటుంది. దీని రేంజ్ 332 నుంచి 449 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మరోవైపు మహీంద్రా XUV 3XO ఈవీ ధర రూ. 13.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 39.4 kWh బ్యాటరీ ఉంటుంది, ఇది 285 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. స్పేస్, ప్రాక్టికాలిటీ కోరుకునే వారికి మహీంద్రా కారు ఒక మంచి ఆప్షన్. మొత్తం మీద, తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ కావాలంటే పంచ్ ఈవీ అదరగొడుతోంది, కానీ ప్రీమియం ఫీచర్లు కావాలంటే నెక్సాన్ లేదా విండ్సర్ వైపు చూడొచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
