Instamart Report :వీడు ఆటగాడే..ప్రతీ 36 గంటలకు ఒక ఆర్డర్..ఏడాదిలో కండోమ్స్‌పై లక్ష ఖర్చు.

Instamart Report : క్విక్ కామర్స్ రంగం భారత్‌లో విప్లవాత్మకంగా మారింది. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఆర్డర్లు ఇంటి వద్దకే చేరడంతో దీని క్రేజ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టామార్ట్ విడుదల చేసిన వార్షిక నివేదిక హౌ ఇండియా ఇన్‌స్టామార్టెడ్ 2025 ప్రకారం చెన్నైకి చెందిన ఒక వ్యక్తి కండోమ్స్ కొనుగోలులో సరికొత్త రికార్డు సృష్టించారు. 2025 సంవత్సరంలో ఈ యూజర్ 228 వేర్వేరు కండోమ్ ఆర్డర్లు చేశాడు. అంటే దాదాపు ప్రతి 36 గంటలకు ఒక ఆర్డర్ చేశాడన్నమాట. ఈ కొనుగోళ్ల కోసం ఆయన మొత్తం రూ.1,06,398 ఖర్చు చేశారు. ఇన్‌స్టామార్ట్ చరిత్రలో అత్యంత తరచుగా కొనుగోలు చేసే పద్ధతుల్లో ఇది ఒకటిగా నమోదైంది. గత సంవత్సరం ఈ రికార్డు బెంగళూరు నివాసి పేరిట ఉండేది.
ఇన్‌స్టామార్ట్ నివేదిక ప్రకారం.. సంస్థకు వచ్చే ప్రతీ 127 ఆర్డర్‌లలో ఒకటి కండోమ్‌కు సంబంధించినదే. ఇది క్విక్ కామర్స్ ద్వారా అత్యవసర, వ్యక్తిగత వస్తువుల కొనుగోలు పెరిగిన తీరును తెలియజేస్తుంది. ముఖ్యంగా సెప్టెంబర్‌లో కండోమ్‌ల కొనుగోలులో నెలవారీగా 24 శాతం పెరుగుదల కనిపించింది. ఈ నివేదిక జనవరి నుండి నవంబర్ మధ్య 128 కంటే ఎక్కువ నగరాల్లో జరిగిన లక్షలాది ఆర్డర్లను విశ్లేషించి రూపొందించబడింది.
ఇన్‌స్టామార్ట్ నివేదిక ప్రకారం, భారతదేశంలో క్విక్ కామర్స్ వినియోగ తీరు బాగా పెరిగింది. ముంబైకి చెందిన ఒక వినియోగదారు రూ. 15.16 లక్షల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారు. హైదరాబాద్ నివాసి ఒకేసారి రూ. 4.3 లక్షల విలువైన ఐఫోన్‌ను ఆర్డర్ చేశారు. బెంగళూరు యూజర్ డెలివరీ టిప్‌గా రూ. 68,600 చెల్లించి జాతీయ స్థాయిలో అత్యధిక టిప్ ఇచ్చిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
ఇన్‌స్టామార్ట్ ద్వారా 2025లో అత్యధికంగా ఖర్చు చేసిన వినియోగదారుడు దాదాపు రూ.22 లక్షల కంటే ఎక్కువ విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ అనామక యూజర్ కొనుగోలు చేసిన వస్తువుల్లో 22 ఐఫోన్ 17లు, 24 క్యారెట్ల బంగారు నాణేలు, పాలు, పండ్లు, గుడ్లు వంటి రోజువారీ అవసరమైన వస్తువులు ఉన్నాయి. ఇన్‌స్టామార్ట్ ద్వారా అత్యధిక విలువ కలిగిన ఈ కార్ట్, 10 నిమిషాల డెలివరీ ఎకానమీలో అత్యంత ఖరీదైన వస్తువులతో పాటు అత్యంత సాధారణ ఉత్పత్తులు కూడా ఎంత సులభంగా సహజీవనం చేస్తున్నాయో తెలియజేస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

