RBI clamps down: ఆ బ్యాంకుపై ఆర్‌బీఐ ఆంక్షలు.. ఎందుకైనా మంచిది ఓ సారి చెక్ చేసుకోండి..

RBI clamps down
RBI clamps down కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న 'దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్' ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న విషయం ఆర్బీఐ (భారతీయ రిజర్వ్ బ్యాంక్) దృష్టికి వచ్చింది. దీంతో ఆర్బీఐ వెంటనే ఆ బ్యాంక్‌పై కొన్ని ఆంక్షలు జారీ చేసింది. పరిస్థితి మెరుగు పడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఆర్బీఐ పేర్కొంది. ఈ బ్యాంకులో ఖాతాదారులు రూ.1000 వరకు మాత్రమే నగదు ఉపసంహరించుకునేలా పరిమితి విధించింది.
అలాగే కొత్తగా రుణాలు ఇవ్వడం, నిధులు సమకూర్చుకోవడం, డిపాజిట్లు స్వీకరించడం పూర్తిగా నిలిపివేయాలని బ్యాంకును ఆదేశించింది. కొత్తగా ఎక్కడా పెట్టుబడులు కూడా పెట్టొద్దని బ్యాంకుకు ఆర్బీఐ తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం బ్యాంకు సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు పేరిట ఉన్న ఆస్తుల్ని కూడా విక్రయించొద్దని స్సష్టం చేసింది. ఎలాంటి చెల్లింపులు చేయొద్దని ఆదేశించింది.
అయితే బ్యాంకు ఖాతాదారులు 99.58 శాతం మంది 'డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కోఆపరేషన్ (డీఐసీజీసీ)' కింద నమోదై ఉన్నారని వారందరికీ బీమా రూపంలో భద్రత లభిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకుపై ఆంక్షలు విధించినంత మాత్రాన ఖాతాదారులు కంగారు పడవలసిన పనిలేదని బ్యాంకు లైసెన్స్ రద్దు కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు కొన్ని పరిమితులు కొనసాగుతాయని తెలిపింది. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆంక్షలు సడలిస్తామని ఆర్బీఐ పేర్కొంది. కాగా తాజాగా విధించిన ఆంక్షలు ఫిబ్రవరి 19 సాయింత్రం నుంచి మొదలై ఆరు నెలల పాటు కొనసాగుతాయని వెల్లడించింది.
Also Read:పెంట్ హౌస్‌కి రూ.420 కోట్లా.. సారు సంపాదన శానా ఉన్నట్టుంది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com