RBI : గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ బిగ్ అప్‌డేట్.

RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. విధాన రేట్లను మరింత తగ్గించడానికి అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్‌లో జరిగిన చివరి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలోనే రేట్ల తగ్గింపునకు అవకాశం ఉందని చెప్పామని, అప్పటి నుంచి వచ్చిన మ్యాక్రో ఎకనామిక్ డేటా ఆ అవకాశాన్ని తగ్గించలేదు అని మల్హోత్రా పేర్కొన్నారు.
గవర్నర్ వ్యాఖ్యల నేపథ్యంలో సాధారణ ప్రజలంతా లోన్ ఈఎంఐలు తగ్గుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంపీసీ 2025 మొదటి అర్ధభాగంలో వడ్డీ రేట్లను మొత్తం 100 బేసిస్ పాయింట్లు (1%) తగ్గించింది. అయితే, ఆగస్టు నుంచి ఈ తగ్గింపుకు తాత్కాలికంగా విరామం ఇచ్చింది.
భారత వడ్డీ రేటు ప్యానెల్ సభ్యులు భవిష్యత్తులో రేట్ల తగ్గింపునకు అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. అక్టోబర్ సమావేశం వివరాల ప్రకారం, దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం, కన్స్యూమర్ గూడ్స్‌పై పన్నులు తగ్గడం వల్ల అక్టోబర్‌లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 0.25 శాతం రికార్డు కనిష్ట స్థాయికి చేరింది. ద్రవ్యోల్బణం ఇలా తగ్గడం అనేది డిసెంబర్‌లో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడానికి మార్గం సుగమం చేసింది. తుది నిర్ణయం మాత్రం ఎంపీసీ సమావేశంపై ఆధారపడి ఉంటుంది.
గవర్నర్ వ్యాఖ్యల తర్వాత భారతదేశ 10-సంవత్సరాల బెంచ్‌మార్క్ బాండ్ ఈల్డ్ స్వల్పంగా తగ్గింది. అయితే మార్కెట్ అంచనాలకు దగ్గరగా ఉండే ఓవర్‌నైట్ ఇండెక్స్ స్వాప్ రేట్లు మాత్రం యథాతథ స్థితిని సూచిస్తున్నాయి.
ఇదే ఇంటర్వ్యూలో రూపాయి విలువ పడిపోవడంపై కూడా మల్హోత్రా మాట్లాడారు. రూపాయి విలువ ఇటీవల తగ్గడం సహజమే అని ఆయన అన్నారు. రూపాయిలో అత్యధిక అస్థిరతను నియంత్రించడానికి ఆర్బీఐ జోక్యం చేసుకుంటుంది, కానీ 3-3.5 శాతం వార్షిక పతనం అనేది చారిత్రక సగటుకు అనుగుణంగా ఉందని వివరించారు.
పోర్ట్‌ఫోలియో విత్ డ్రాలు, అమెరికాతో వాణిజ్య వివాదాల కారణంగా శుక్రవారం రూపాయి 89.49 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది రూపాయి విలువ 4% కంటే కొంచెం ఎక్కువ తగ్గింది. దీంతో ఇది అత్యంత పేలవంగా పనిచేసిన ఆసియా కరెన్సీలలో ఒకటిగా ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

