RBI Monetary Policy : బడ్జెట్ తర్వాత అతిపెద్ద షాక్..సామాన్యుడి ఆశలపై నీళ్లు చల్లిన ఆర్బీఐ.

RBI Monetary Policy : బడ్జెట్ తర్వాత అతిపెద్ద షాక్..సామాన్యుడి ఆశలపై నీళ్లు చల్లిన ఆర్బీఐ.
X

RBI Monetary Policy : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశించిన సామాన్యుడికి నిరాశే ఎదురైంది. వడ్డీ రేట్ల తగ్గింపుతో ఈఎంఐలు తగ్గుతాయని భావించిన మధ్యతరగతి ప్రజల ఆశలపై ఆర్బీఐ నీళ్లు చల్లింది. ఫిబ్రవరి 2026లో జరిగిన ద్రవ్యోల్బణ పరపతి సమీక్ష ముగిసిన అనంతరం, రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయడం లేదని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల పాటు జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న రెపో రేటును 5.25 శాతం వద్దే ఉంచాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. గడిచిన ఏడాది కాలంలో ఆర్బీఐ మొత్తం 125 బేసిస్ పాయింట్ల మేర కోత విధించినప్పటికీ, ఈసారి మాత్రం వేచి చూసే ధోరణిని అవలంబించింది. దేశంలో ఆర్థిక వృద్ధి సానుకూలంగా ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ముఖ్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (FY27) మొదటి రెండు త్రైమాసికాలకు సంబంధించి ఆర్బీఐ షాకింగ్ అంచనాలను వెల్లడించింది. గతంలో ఊహించిన దానికంటే ఎక్కువగా ద్రవ్యోల్బణం ఉంటుందని పేర్కొంది. మొదటి త్రైమాసికంలో ఇది 4 శాతంగా, రెండో త్రైమాసికంలో 4.2 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది. దీని అర్థం రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గిస్తే మార్కెట్లో నగదు లభ్యత పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్బీఐ భావిస్తోంది.

ఆర్బీఐ నిర్ణయం వల్ల హోమ్ లోన్లు, కార్ లోన్లు లేదా పర్సనల్ లోన్లు తీసుకున్న వారిపై తక్షణమే అదనపు భారం పడదు. కానీ, వడ్డీ రేట్లు తగ్గుతాయని ఆశించిన వారు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. రెపో రేటు తగ్గకపోవడంతో బ్యాంకులు కూడా తమ లెండింగ్ రేట్లను తగ్గించవు. దీనివల్ల ఈఎంఐ భారం యధాతథంగా కొనసాగుతుంది. అయితే ఆర్బీఐ గవర్నర్ ఒక సానుకూల విషయాన్ని కూడా చెప్పారు. ఇటీవలి ఒప్పందాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, వృద్ధి రేటుపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడితే తదుపరి సమీక్షలో సానుకూల నిర్ణయం ఉండే అవకాశం ఉంది.

Tags

Next Story