Gold Reserves : పసిడి పిచ్చితో దేశాలు కొట్టుకుంటుంటే..ఆర్బీఐ మాత్రం సైలెంట్ అయిపోయింది..ఎందుకో తెలుసా?
Gold Reserves : ప్రపంచ దేశాలన్నీ బంగారం కొనుగోళ్లలో పోటీపడుతుంటే మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాత్రం ఒక్కసారిగా తన గేర్ మార్చింది. 2024లో భారీగా పసిడిని పోగేసిన ఆర్బీఐ, 2025 వచ్చేసరికి కొనుగోళ్లను భారీగా తగ్గించేసింది. అస్సలు ఆర్బీఐ వ్యూహం ఏంటి? బంగారం కొనడం ఎందుకు తగ్గించింది? మన దేశ బంగారం నిల్వలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ బంగారం కొనుగోళ్ల విషయంలో తన వ్యూహాన్ని మార్చుకుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం.. 2025లో ఆర్బీఐ కేవలం 4.02 టన్నుల బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. అదే 2024లో చూస్తే ఏకంగా 72.6 టన్నుల పసిడిని ఆర్బీఐ తన ఖాతాలో వేసుకుంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే కొనుగోళ్లు 94 శాతం తగ్గిపోయాయి. అందరూ బంగారం కొంటుంటే ఆర్బీఐ ఎందుకు తగ్గించిందనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. అయితే, దీని వెనుక ఉన్న కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు.
నిజానికి ఆర్బీఐ దగ్గర ఇప్పుడు రికార్డు స్థాయిలో 880.2 టన్నుల బంగారం ఉంది. ఇది మన దేశ చరిత్రలోనే అత్యధికం. 2025 నవంబర్ నాటికి మన గోల్డ్ రిజర్వ్స్ విలువ 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8.3 లక్షల కోట్లు) దాటేసింది. మన విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా గతంలో 5.87 శాతం ఉంటే, ఇప్పుడది 16 శాతానికి పెరిగింది. అంటే ఐదేళ్లలో మన నిల్వలు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. ఇప్పటికే నిల్వలు భారీగా ఉండటం, మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఆర్బీఐ ఇప్పుడు మరిన్ని కొనుగోళ్లు చేయకుండా, ఉన్న నిల్వలను సమర్థవంతంగా నిర్వహించే పనిలో పడింది.
మరి ఇంత బంగారం ఎక్కడ ఉందనే సందేహం రావచ్చు. మార్చి 2025 లెక్కల ప్రకారం.. ఆర్బీఐ దగ్గర ఉన్న 879.59 టన్నుల బంగారంలో సుమారు 512 టన్నులు ఇండియాలోనే భద్రంగా ఉంది. మిగిలిన బంగారాన్ని భద్రత, అంతర్జాతీయ లావాదేవీల దృష్ట్యా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ వద్ద ఉంచారు. ఒకప్పుడు మన దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు బంగారం తాకట్టు పెట్టిన పరిస్థితి నుంచి, ఇప్పుడు విదేశీ బ్యాంకుల నుంచి మన బంగారాన్ని తిరిగి ఇండియాకు తెచ్చుకునే స్థాయికి ఎదిగాము.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. 1996 తర్వాత మొదటిసారిగా సెంట్రల్ బ్యాంకుల వద్ద అమెరికా ట్రెజరీ బాండ్ల కంటే బంగారమే ఎక్కువగా ఉంది. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల నిల్వల్లో బంగారం వాటా 20 శాతానికి చేరింది, ఇది యూరో (16%) కంటే కూడా ఎక్కువ. 2022 నుంచి బంగారం ధరలు ఏకంగా 175 శాతం పెరగడం, కేవలం 2025లోనే 65 శాతం వృద్ధి నమోదు చేయడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం మరియు ఆర్థిక అనిశ్చితి వల్ల ప్రతి దేశం తమ కరెన్సీ కంటే బంగారాన్ని నమ్ముకోవడమే దీనికి ప్రధాన కారణం. ఆర్బీఐ కూడా తన వద్ద తగినంత నిధిని సమకూర్చుకుని ఇప్పుడు సేఫ్ జోన్‌లో ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


