Gold Reserve : ఆర్‌బీఐ రికార్డు.. తొలిసారి 100 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించిన బంగారు నిల్వలు.

Gold Reserve : బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ సమయంలో భారతదేశం ఒక అరుదైన ఘనతను సాధించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ బంగారం నిల్వలు మొదటిసారిగా 100 బిలియన్ డాలర్ల మార్కును దాటాయి. అక్టోబర్ 10తో ముగిసిన వారంలో దేశ బంగారం నిల్వలు 3.59 బిలియన్ డాలర్లు పెరిగి, 102.36 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. వరుసగా ఇది ఏడవ వారం కావడం విశేషం, భారతదేశ బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. అయితే, ఇదే సమయంలో దేశ విదేశీ మారక నిల్వలు స్వల్పంగా తగ్గి 697.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మొత్తం గోల్డ్ రిజర్వ్‌లో భారతదేశ వాటా ఇప్పుడు 14.7 శాతంగా ఉంది. ఇది 1990ల తర్వాత అత్యధికం. రిజర్వ్ బ్యాంక్ జనవరి నుండి సెప్టెంబర్ మధ్య దాదాపు 4 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఆర్థిక సంవత్సరం 2024-25లో ఆర్‌బీఐ దాదాపు 57.5 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2025లో మొదటి తొమ్మిది నెలల్లో, కేవలం నాలుగు నెలలు మాత్రమే రిజర్వ్ బ్యాంక్ నికరంగా బంగారాన్ని కొనుగోలు చేసింది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, "భారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా భారీగా పెరిగింది. ఇది ముఖ్యంగా బంగారం ధరలు పెరగడం వల్ల విలువ పెరిగింది" అని అన్నారు. ఈ పెరుగుదల ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య నిల్వల్లో వివిధ రకాల ఆస్తుల వాటాను పెంచాలనే ప్రపంచవ్యాప్త ధోరణికి బలాన్నిచ్చింది. ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు డాలర్ నుండి దృష్టిని మళ్లించి, బంగారం కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ నష్టాల మధ్య డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే వీరి లక్ష్యం. పోలాండ్ నుండి ఉజ్బెకిస్తాన్, టర్కీ వంటి దేశాలు భారీగా బంగారాన్ని కొనుగోలు చేశాయి.
ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 10తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 2.176 బిలియన్ డాలర్లు తగ్గి 697.784 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇది వరుసగా రెండవ వారం నమోదైన తగ్గుదల. దీనికి ముందు గత వారంలో నిల్వలు 27.6 కోట్ల డాలర్లు తగ్గి 699.96 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఆర్‌బీఐ డేటా ప్రకారం.. విదేశీ మారక నిల్వల్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 5.60 బిలియన్ డాలర్లు భారీగా తగ్గి 572.10 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎఫ్‌సీఏ గణాంకాలు నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి కరెన్సీల విలువలో హెచ్చుతగ్గులను సూచిస్తాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com