Loans : మారిన గోల్డ్, సిల్వర్ లోన్ రూల్స్.. ఇక బ్యాంకులకు దబిడిదిబిడే.

Loans : బంగారం, వెండి ధరలు కూడా ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు బంగారం, వెండిని కుదవ పెట్టుకుని రుణాలు ఇచ్చే విధానంలో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా చిన్న రుణాలపై లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిని పెంచడం, కుదవ పెట్టే వస్తువుల పరిమితులు, రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత ఆభరణాలను తిరిగి ఇచ్చే సమయం వంటి విషయాల్లో ఆర్‌బిఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త నియమాలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.
లోన్ టు వాల్యూ (LTV) అంటే, మీరు కుదవ పెట్టే బంగారం లేదా వెండి మొత్తం విలువకు గాను, బ్యాంక్ ఇచ్చే రుణ మొత్తం. ఆర్‌బిఐ చిన్న రుణాల కోసం ఈ నిష్పత్తిని గణనీయంగా పెంచింది. రూ. 2.5 లక్షల వరకు తీసుకునే రుణాల కోసం, లోన్ టు వాల్యూ (LTV) నిష్పత్తిని 75 శాతం నుంచి 85 శాతంకి పెంచారు. ఉదాహరణకు మీరు కుదవ పెట్టే బంగారం లేదా వెండి విలువ రూ. 2 లక్షలు ఉంటే, కొత్త నియమం ప్రకారం మీరు గరిష్టంగా రూ. 1,70,000 (85%) వరకు రుణం పొందవచ్చు.
రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు తీసుకునే రుణాలకు 80 శాతం విలువను పరిగణనలోకి తీసుకుంటారు. రూ. 5 లక్షల కంటే ఎక్కువ రుణాలకు 75 శాతం విలువను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు మీరు రూ. 6 లక్షల రుణం పొందాలంటే, కనీసం రూ. 8 లక్షల విలువైన బంగారు ఆభరణాలు లేదా వెండి వస్తువులను కుదవ పెట్టాల్సి ఉంటుంది.
2. కుదవ పెట్టడానికి అనుమతించిన వస్తువులు, పరిమితులు
ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం, అన్ని రకాల బంగారం, వెండి వస్తువులను కుదవ పెట్టడానికి అనుమతించరు. బంగారు బిస్కెట్లు, వెండి కడ్డీలను కుదవ పెట్టి రుణం తీసుకోవడానికి అనుమతి లేదు. బంగారు, వెండి ఆభరణాలు, నాణేలు, దీపాలు, గిన్నెలు వంటి వస్తువులను కుదవ పెట్టవచ్చు. వెండి నాణేలను కూడా కుదవ పెట్టవచ్చు. తాకట్టు పెట్టడంపై పరిమితి విధించింది. బంగారు ఆభరణాలు అయితే ఒక కిలో, బంగారు నాణేలు 50గ్రాములు, వెండి ఆభరణాలు 10కిలోలు, వెండి నాణేలు 500గ్రాముల వరకు కుదవ పెట్టవచ్చు.
రుణం తీసుకున్నవారికి ఉపశమనం కలిగించేలా, ఆర్‌బిఐ ఆభరణాల తక్షణ రిటర్న్ పై కఠిన నిబంధనను పెట్టింది. రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించిన అదే రోజు కుదవ పెట్టిన బంగారం లేదా వెండి వస్తువులను బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ తప్పనిసరిగా తిరిగి ఇవ్వాలి. అదే రోజు ఇవ్వడం సాధ్యం కాకపోతే, గరిష్టంగా ఏడు (7) పనిదినాలలోపు తిరిగి ఇవ్వాలి. ఈ గడువును బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు పాటించడంలో విఫలమైతే, జాప్యం అయిన ప్రతి రోజుకు రూ. 5,000 చొప్పున రుణగ్రహీతకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌బిఐ ఈ కొత్త మార్గదర్శకాలన్నీ తరువాత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1, 2026) నుంచి అమలులోకి వస్తాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

