Jio IPO : భారత మార్కెట్లోకి అంబానీ సునామీ..జియో ఐపీఓతో లక్షల కోట్లు కొల్లగొట్టే స్కెచ్ రెడీ.

JIO IPO : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓకి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. జూన్ 2026 నాటికి రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూ రాబోతోందని వార్తలు వస్తున్నాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. ఇది దేశంలోనే ఇప్పటివరకు రానంత భారీ ఐపీఓ కాబోతోంది.
రిలయన్స్ జియో ప్లాట్‌ఫారమ్స్ ఐపీఓ కోసం ముఖేష్ అంబానీ భారీ స్కెచ్ వేశారు. ఈ ఐపీఓ విలువ సుమారు 182 బిలియన్ డాలర్లు (రూ.15 లక్షల కోట్లు) ఉండవచ్చని అంచనా. కేవలం 2.5 శాతం వాటాను మాత్రమే విక్రయించడం ద్వారా దాదాపు రూ.40,000 కోట్ల నిధులను సేకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే, భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక వాల్యూయేషన్ ఉన్న ఐపీఓగా ఇది రికార్డు సృష్టించనుంది. ఇప్పటికే మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ సాక్స్ వంటి దిగ్గజ బ్యాంకర్లను కంపెనీ ఎంపిక చేసినట్లు సమాచారం.
గూగుల్, మెటా పెట్టుబడుల పరంపర
2020లో జియో ప్లాట్‌ఫారమ్స్‌లో గూగుల్ (7.75%), మెటా (9.99%) వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఐపీఓలో గూగుల్, మెటా తమ వాటాలను కొనసాగించే అవకాశం ఉండగా.. కేకేఆర్, టీపీజీ వంటి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు తమ వాటాలను కొంత మేర తగ్గించుకోవచ్చు. రిలయన్స్ ఇప్పటికే తన టెలికాం మరియు డిజిటల్ బిజినెస్‌ను అప్పులు లేని సంస్థగా మార్చింది. ఇప్పుడు ఐపీఓ ద్వారా మరింత బలోపేతం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వాల్యూయేషన్ పై బ్రోకరేజ్ సంస్థల లెక్కలివే
జియో వాల్యూయేషన్ విషయంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. జెఫరీస్ జియో ఎంటర్‌ప్రైజ్ విలువను 180 బిలియన్ డాలర్లుగా అంచనా వేయగా, మోతీలాల్ ఓస్వాల్ 148 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ దీని విలువ రూ.11.59 లక్షల కోట్లుగా లెక్కగట్టింది. సెబీ నిబంధనల ప్రకారం క్లారిటీ రాగానే డ్రాఫ్ట్ పేపర్లు దాఖలు చేసేందుకు రిలయన్స్ సిద్ధంగా ఉంది.
ఇన్వెస్టర్ల ఆశలన్నీ జూన్ పైనే
రిలయన్స్ షేర్లు గత కొద్ది రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ, జియో ఐపీఓ ప్రకటనతో ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. వచ్చే కొన్ని నెలల్లో నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రాగానే ఐపీఓ ప్రక్రియ వేగవంతం కానుంది. అంబానీ తన టెలికాం సామ్రాజ్యాన్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం ద్వారా సామాన్య ఇన్వెస్టర్లకు కూడా జియోలో భాగస్వామ్యం కల్పించబోతున్నారు. ఇది 2026 సంవత్సరపు అతిపెద్ద బిజినెస్ న్యూస్ కాబోతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
