Renault Bridger : థార్, జిమ్నీలకు చుక్కలే.. రెనాల్ట్ నుంచి అదిరిపోయే బ్రిజర్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది.

Renault Bridger : ఫ్రెంచ్ కార్ల దిగ్గజం రెనాల్ట్ భారత మార్కెట్లో మళ్ళీ తన పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న డస్టర్ ను ఈ నెలలోనే గ్రాండ్‌గా రీ-లాంచ్ చేస్తున్న కంపెనీ, తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. నేరుగా మారుతి జిమ్నీ, మహీంద్రా థార్ వంటి పవర్ ఫుల్ ఆఫ్ రోడర్లకు పోటీగా ఒక సరికొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది. దీనికి బ్రిజర్ అనే పేరు పెట్టారు. దీని కాన్సెప్ట్ వెర్షన్ వరల్డ్ ప్రీమియర్ నేడే (మార్చి 10) జరగనుంది. 2027 దీపావళి నాటికి ఇది భారత రోడ్లపై పరుగులు తీసే అవకాశం ఉంది.
రెనాల్ట్ సంస్థ ఈ కొత్త కారును అంతర్గతంగా RB3-K2 B-SUV అనే కోడ్ నేమ్‌తో పిలుస్తోంది. దీనిని చాలా మంది ఆటోమొబైల్ నిపుణులు మినీ డస్టర్ అని కూడా పిలుస్తున్నారు. ఇది కంపెనీ ప్రస్తుత మోడల్ రెనాల్ట్ కైగర్ కంటే పై స్థాయిలో, డస్టర్ కంటే కొంచెం కింద స్థాయిలో ఉంటుంది. ఈ కారు ద్వారా ఏడాదికి కనీసం 80 వేల నుంచి 90 వేల యూనిట్ల అదనపు విక్రయాలను సాధించాలని రెనాల్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని ధర సుమారు రూ.10 లక్షల (బేస్ వేరియంట్) నుంచి ప్రారంభమై రూ.20 లక్షల (టాప్ ఎండ్) వరకు ఉండే అవకాశం ఉంది.
ఈ బ్రిజర్ ఎస్‌యూవీని పూర్తిస్థాయిలో భారత్‌లోనే డిజైన్ చేసి, అభివృద్ధి చేస్తున్నారు. ఇది కంపెనీ సరికొత్త లోకలైజ్డ్, మాడ్యులర్ R-GMP ప్లాట్‌ఫారమ్ మీద రూపొందుతోంది. చెన్నైలోని రెనాల్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి ఈ కారును ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. అంటే భారత్ ఇకపై రెనాల్ట్ ఎగుమతులకు గ్లోబల్ హబ్‌గా మారబోతోంది.
రెనాల్ట్ బ్రిజర్ ఇంజిన్ల విషయంలో కస్టమర్లకు భారీ ఆప్షన్లను ఇవ్వబోతోంది. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఉంటాయి. అంతేకాకుండా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దీనిని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా తెస్తున్నారు. ఈ ఈవీ వేరియంట్ 35 kWh, 55 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. వీటితో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్, సీఎన్జీ ఆప్షన్లను కూడా కంపెనీ పరిశీలిస్తోంది.
ఇప్పటివరకు విడుదలైన టీజర్ల ప్రకారం, బ్రిజర్ డిజైన్ చాలా గంభీరంగా ఉండబోతోంది. ఇది చూడటానికి లగ్జరీ కారు ల్యాండ్ రోవర్ డిఫెండర్ లాగా బాక్సీ లుక్‌లో కనిపిస్తుంది. వెనుక భాగంలో టెయిల్‌గేట్‌కు స్పేర్ వీల్ (స్టెపినీ) తగిలించి ఉండటం వల్ల దీనికి పక్కా లైఫ్ స్టైల్ ఎస్‌యూవీ లుక్ వచ్చింది. సబ్-4 మీటర్ కారే అయినప్పటికీ, లోపల కేబిన్ స్పేస్, లెగ్ రూమ్ చాలా విశాలంగా ఉండేలా రెనాల్ట్ జాగ్రత్తలు తీసుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
