Renault Duster 2.0 : రిపబ్లిక్ డే రోజున బాంబు పేల్చనున్న రెనాల్ట్..అగ్నిపరీక్షలో నెగ్గిన కొత్త డస్టర్.

Renault Duster 2.0 : భారత వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త తరం రెనో డస్టర్ ఎస్‌యూవీ జనవరి 26న (రిపబ్లిక్ డే) మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. అయితే మార్కెట్లోకి రాకముందే ఈ కారు తన క్వాలిటీని ప్రపంచానికి చాటిచెప్పింది. ఏకంగా మూడు ఖండాల్లోని విభిన్న భౌగోళిక పరిస్థితుల్లో సుమారు 10 లక్షల కిలోమీటర్ల మేర దీనిని నడిపించి టెస్టింగ్ పూర్తి చేశారు. కేవలం ల్యాబ్‌లలోనే కాకుండా, మనుషులు తిరగలేని అత్యంత కఠినమైన ప్రదేశాల్లో కూడా ఈ కారును పరీక్షించినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ ఎస్‌యూవీని మైనస్ -23 డిగ్రీల సెల్సియస్ గడ్డకట్టే చలి నుంచి, 55 డిగ్రీల సెల్సియస్ మండుటెండల వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నడిపించారు. దీనివల్ల విపరీతమైన ఎండల్లో ఇంజిన్ వేడెక్కకుండా, అత్యంత చలిలో స్టార్టింగ్ ట్రబుల్ రాకుండా కారు ఎలా పనిచేస్తుందో ఇంజనీర్లు విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న రహదారులు, డ్రైవింగ్ శైలులకు అనుగుణంగా దీనిని ట్యూన్ చేశారు.
ఈ పది లక్షల కిలోమీటర్ల టెస్టింగ్ ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం మన దేశంలోనే జరిగింది. లేహ్-లడఖ్‌లోని అత్యంత ఎత్తైన రహదారి ఖర్దుంగ్ లా పాస్ (18,379 అడుగుల ఎత్తు) మీద డస్టర్ విజయవంతంగా దూసుకుపోయింది. ఇంత ఎత్తులో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి, పైగా నిటారైన ఎత్తులు ఉంటాయి. ఇలాంటి చోట కూడా ఇంజిన్ పర్ఫార్మెన్స్ తగ్గకుండా ఉండటం డస్టర్ యొక్క అసలైన విజయం. కేవలం ఎత్తైన ప్రదేశాలే కాకుండా, లోతైన నీటి మార్గాలు, దుమ్ము ధూళి నిండిన టన్నెల్స్, విపరీతమైన గుంతల రోడ్లపై కూడా దీనిని పరీక్షించారు.
భారతదేశంలోని బిజీ ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ టెస్టింగ్ సెంటర్లైన NATRAX, ARAI ట్రాక్‌లపై డస్టర్‌ను నడిపించారు. బంపర్-టు-బంపర్ ట్రాఫిక్, స్పీడ్ బ్రేకర్లు, తరచూ ఆగాల్సి వచ్చే పరిస్థితుల్లో కారు కంఫర్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ సరిచూశారు. బ్రెజిల్, రొమేనియా, ఫ్రాన్స్, చైనా వంటి దేశాల్లో కూడా దీనిని పరీక్షించి, గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా రూపొందించారు.
ఏ వాతావరణంలోనైనా, ఎలాంటి రోడ్డు మీదనైనా తిరుగులేని ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా రెనో డస్టర్ సిద్ధమైంది. 10 లక్షల కిలోమీటర్ల కఠిన పరీక్షల్లో నెగ్గిన ఈ కారు, ఇండియన్ కస్టమర్ల నమ్మకాన్ని మళ్ళీ గెలుచుకుంటుందని కంపెనీ ధీమాగా ఉంది. జనవరి 26న దీని ధర, ఇతర టెక్నికల్ వివరాలు పూర్తిగా వెల్లడికానున్నాయి. ఎస్‌యూవీల సామ్రాజ్యంలో పాత రోజులను మళ్ళీ గుర్తుకు తెచ్చేలా డస్టర్ రీ-ఎంట్రీ ఉండబోతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

