New Renault Duster 2026 : వచ్చేస్తోంది కొత్త రెనాల్ట్ డస్టర్.. 7 ఏళ్ల వారంటీతో మార్కెట్లో ప్రకంపనలు.

New Renault Duster 2026 : వచ్చేస్తోంది కొత్త రెనాల్ట్ డస్టర్.. 7 ఏళ్ల వారంటీతో మార్కెట్లో ప్రకంపనలు.
X

New Renault Duster 2026 : ఒకప్పుడు మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రారాజుగా వెలిగిన రెనాల్ట్ డస్టర్ మళ్ళీ తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి సిద్ధమైంది. సుమారు మూడేళ్ల విరామం తర్వాత, సరికొత్త అవతారంలో డస్టర్ భారత్‌లో అడుగుపెడుతోంది. మార్చి 17న ఈ ఐకానిక్ కారును అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు రెనో ఇండియా ధృవీకరించింది. పాత మోడల్ పట్ల ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ కొత్త వెర్షన్ కోసం కస్టమర్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ కారు బుకింగ్స్ రూ.21,000 తో ప్రారంభమయ్యాయి. కంపెనీ తన కస్టమర్లకు ఒక అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. అదే 7 ఏళ్ల వారంటీ. భారత మార్కెట్లో ఒక ఎస్‌యూవీకి ఇంత సుదీర్ఘ కాలం వారంటీ ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. టర్బో-పెట్రోల్ వేరియంట్ కొనాలనుకునే వారికి ఏప్రిల్ మధ్యలో డెలివరీలు అందుతాయి. ఇక మైలేజీ ఎక్కువగా కోరుకునే వారి కోసం తీసుకొస్తున్న స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ 2026 దీపావళి నాటికి రోడ్లపైకి రానుంది.

కొత్త డస్టర్ డిజైన్ పరంగా చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. యూరప్ మోడల్‌తో పోలిస్తే భారత్ కోసం కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. కొత్త హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, వెడల్పైన వీల్ ఆర్చెస్, రూఫ్ రైల్స్ దీనికి మాకో లుక్ ఇస్తున్నాయి. కారు లోపల కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 10.2 అంగుళాల డిజిటల్ మీటర్, గూగుల్ సపోర్ట్ ఉన్న 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ప్రధాన ఆకర్షణలు.

లగ్జరీ, సేఫ్టీ విషయంలో విషయంలో కూడా రెనాల్ట్ కంపెనీ ఎక్కడా తగ్గలేదు. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరాతో పాటు 17 ఫీచర్లతో కూడిన ADAS సేఫ్టీ ప్యాకేజీని జోడించారు. సామాను పెట్టుకోవడానికి డిక్కీలో ఏకంగా 700 లీటర్ల స్థలం ఉండటం ఈ కారుకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్. మొత్తానికి క్రెటా, సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు డస్టర్ రీ-ఎంట్రీ అదిరిపోనుందని స్పష్టమవుతోంది.

Tags

Next Story