Renault Duster : డస్టర్ ఈజ్ బ్యాక్..మూడేళ్ల తర్వాత సరికొత్త అవతారంలో రెనాల్ట్ ఎస్‌యూవీ.

Renault Duster : రెనాల్ట్ ఇండియా తన పాపులర్ ఎస్‌యూవీ డస్టర్‌ను 2022లో మొదటి జనరేషన్ మోడల్‌తో నిలిపివేసింది. అయితే, ఇప్పుడు నేరుగా గ్లోబల్ మార్కెట్లో ఉన్న మూడవ జనరేషన్ మోడల్‌ను భారత రోడ్లపైకి తీసుకొస్తోంది. ఈ కొత్త డస్టర్ చూడటానికి పాత బాక్సీ డిజైన్‌ను పోలి ఉన్నప్పటికీ, మునుపటి కంటే చాలా షార్ప్‌గా, మోడరన్‌గా కనిపిస్తుంది. ముందు భాగంలో కొత్త హెడ్‌ల్యాంప్స్, గ్రిల్‌పై Renault అని రాసి ఉండటం, వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ దీనికి కొత్త కళను తెచ్చాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 212 మిమీ కావడంతో, గతుకుల రోడ్లపై కూడా ఇది రాజాలా దూసుకుపోతుంది.
కారు ఇంటీరియర్ విషయానికి వస్తే రెనాల్ట్ దీనిని ఒక లగ్జరీ హోమ్ లాగా తీర్చిదిద్దింది. ఇందులో 10.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. అంతేకాకుండా వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా మరియు 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 17 రకాల ఫీచర్లతో కూడిన ADAS ప్యాకేజీని కూడా అందించారు. ఇక సామాను పెట్టుకోవడానికి ఏకంగా 700 లీటర్ల బూట్ స్పేస్ ఉండటం ఈ కారు యొక్క మరో ప్లస్ పాయింట్.
ఇంజిన్ సామర్థ్యం పరంగా కొత్త డస్టర్ మూడు రకాల ఆప్షన్లతో వస్తోంది. మొదటిది 1.63 పీఎస్ పవర్ ఇచ్చే టర్బో పెట్రోల్ ఇంజిన్. రెండవది 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్. ఈ హైబ్రిడ్ వెర్షన్ ప్రత్యేకత ఏమిటంటే, నగర ప్రయాణాల్లో 80 శాతం వరకు కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడుస్తుంది, దీనివల్ల మైలేజీ అదిరిపోతుంది. ఇక మూడవది బడ్జెట్ వినియోగదారుల కోసం 100 పీఎస్ పవర్ ఇచ్చే నార్మల్ పెట్రోల్ ఇంజిన్. ఇలా అన్ని వర్గాల ప్రజలకు నచ్చేలా ఇంజిన్లను డిజైన్ చేశారు.
ఈ సరికొత్త డస్టర్ మార్చి నెలలో అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానుంది. ప్రస్తుతం కేవలం రూ.21,000 చెల్లించి ఈ కారును ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. టర్బో పెట్రోల్ మోడల్స్ ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వస్తుండగా, హైబ్రిడ్ మోడల్ మాత్రం 2026 దీపావళి నాటికి రోడ్ల మీదకు రానుంది. అన్నింటికంటే ముఖ్యంగా, రెనాల్ట్ ఈ కారుపై ఏకంగా 7 ఏళ్ల వారంటీని ఇస్తోంది. భారత మార్కెట్లో ఒక కారుపై ఇంత ఎక్కువ కాలం వారంటీ ఇవ్వడం రెనాల్ట్ చరిత్రలో ఇదే తొలిసారి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
