Hyundai Motor : కారులో మంటలు చెలరేగే ప్రమాదం.. లక్షలాది కార్లను రీకాల్ చేసిన హ్యుందాయ్.

Hyundai Motor : కారులో మంటలు చెలరేగే ప్రమాదం.. లక్షలాది కార్లను రీకాల్ చేసిన హ్యుందాయ్.
X

Hyundai Motor : ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ అమెరికాలో తమ అత్యంత ప్రజాదరణ పొందిన Santa Fe SUV మోడల్‌కు చెందిన 1.35 లక్షలకు పైగా యూనిట్లను వెనక్కి పిలిచింది. కారులో మంటలు చెలరేగే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికన్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. స్టార్టర్ మోటార్‌కు సంబంధించిన తయారీ లోపం కారణంగా ఈ రీకాల్ చేస్తున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఈ లోపం వల్ల ప్రమాదం జరిగినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి, కారులో మంటలు రావొచ్చు.

అసెంబ్లీ సమయంలో స్టార్టర్ మోటార్ ప్రొటెక్టివ్ కవర్ సరిగ్గా అమర్చబడలేదు. దీనివల్ల ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. ఏదైనా ప్రమాదం లేదా ఢీకొన్న సందర్భంలో ఈ షార్ట్ సర్క్యూట్ మంటలకు దారితీయవచ్చు. అందుకే తక్షణమే ఈ వాహనాలను వెనక్కి పిలిచారు. ఈ రీకాల్ 2.5 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ ఉన్న 2024, 2025 మోడల్ ఇయర్ Santa Fe SUVలకు వర్తిస్తుంది. ఈ వాహనాలు 2023 డిసెంబర్ 28 నుండి 2025 జూలై 7 మధ్య హ్యుందాయ్ అలబామా తయారీ ప్లాంట్‌లో తయారు చేయబడ్డాయి. మొత్తం 1,35,300 కంటే ఎక్కువ యూనిట్లు ప్రభావితమైనట్లు కంపెనీ తెలిపింది.

ప్రభావిత వాహనాల యజమానులను సంప్రదించి, వారికి ఉచితంగా రిపేర్ లేదా పార్ట్ రీప్లేస్‌మెంట్ సదుపాయం అందిస్తామని హ్యుందాయ్ ప్రకటించింది. ఇటీవలి నెలల్లో రికాల్ ప్రకటించిన ఏకైక కంపెనీ హ్యుందాయ్ మాత్రమే కాదు. ఇతర కార్ల కంపెనీలు కూడా తమ ఉత్పత్తులలో లోపాలను గుర్తించాయి. ఇదే వారంలో టయోటా కూడా సుమారు 4 లక్షల వాహనాలను వెనక్కి పిలవనున్నట్లు ప్రకటించింది.

కొన్ని మోడళ్లలో రియర్ వ్యూ కెమెరా పనిచేయకపోవడం ప్రధాన సమస్య. ఒక సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా ఈ సమస్య వస్తుంది. కారు రివర్స్ చేస్తున్నప్పుడు కెమెరా డిస్‌ప్లే పనిచేయకపోవడంతో ప్రమాదాలు జరిగే ముప్పు పెరుగుతుంది. టయోటా తమ డీలర్‌షిప్‌ల వద్ద ఉచిత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందిస్తుంది. ప్రభావిత కస్టమర్‌లకు 2025 నవంబర్ 16 నాటికి అధికారిక నోటిఫికేషన్ లెటర్స్ పంపుతామని కంపెనీ తెలిపింది.

Tags

Next Story