Royal Enfield : ట్యూబ్‌లెస్ వీల్స్, స్టాండర్డ్ ర్యాలీ కిట్..హిమాలయన్ 450 మానా బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది.

Royal Enfield : ట్యూబ్‌లెస్ వీల్స్, స్టాండర్డ్ ర్యాలీ కిట్..హిమాలయన్ 450 మానా బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది.
X

Royal Enfield : అడ్వెంచర్ బైక్ ప్రియులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఒక గుడ్ న్యూస్. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటోవర్స్ 2025లో తన హిమాలయన్ 450 మానా బ్లాక్ ఎడిషన్‎ను లాంచ్ చేసింది. ఈ బైక్ పేరుకు తగ్గట్టుగానే, భారతదేశంలోని ఎత్తైన మోటరబుల్ రోడ్లలో ఒకటైన మానా పాస్ నుంచి ప్రేరణ పొందింది. హిమాలయన్ 450 ఇప్పటికే అడ్వెంచర్ బైక్‌గా పేరు గాంచింది. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌లో కొత్త కాస్మెటిక్ మార్పులు, అదనపు ర్యాలీ ఫీచర్లను జోడించి, ఆఫ్-రోడింగ్‌ను మరింత బలంగా మార్చారు. రెగ్యులర్ హిమాలయన్ 450 కంటే ఈ మానా బ్లాక్ ఎడిషన్ ఎంత భిన్నంగా ఉందో, దాని ధర, ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తాజాగా తమ హిమాలయన్ 450 సిరీస్‌లో అత్యంత ప్రీమియం, ఖరీదైన వేరియంట్‌గా మానా బ్లాక్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.37 లక్షలుగా ఉంది. ఇది ఇప్పటికే ఉన్న హాన్లే బ్లాక్ వేరియంట్ కంటే కూడా ఎక్కువ ధర కావడం వలన, హిమాలయన్ సిరీస్‌లో ఈ మానా బ్లాక్ ఎడిషన్ అత్యంత ఖరీదైన బైక్‌గా నిలిచింది. ఈ మోడల్ ప్రధానంగా కాస్మెటిక్ అప్‌డేట్‌లు, అదనపు ర్యాలీ ఫీచర్లతో రైడర్‌లను ఆకర్షించడానికి సిద్ధమైంది.

మానా బ్లాక్ ఎడిషన్ ప్రధాన ఆకర్షణ దాని స్టైలింగ్, రంగు. ఈ బైక్‌కు కొత్తగా స్టీల్త్ బ్లాక్ కలర్‌ను ఇచ్చారు. ఇది ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, ఇతర మెటల్ భాగాలపై మ్యాట్, సాటిన్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుంది. ఇంజిన్ కేసింగ్, ఛాసిస్, రిమ్స్ కూడా డార్క్ థీమ్‌లో ఉండటం వలన, బైక్‌కు ఒక డైనమిక్, స్టెల్తీ, పటిష్టమైన ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. ఈ డిజైన్ మార్పులు బైక్‌ను మరింత పవర్ఫుల్ గా కనిపించేలా చేశాయి.

ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌లో ర్యాలీ ఫీచర్లు అదనంగా జోడించబడ్డాయి. మానా బ్లాక్ ఎడిషన్‌లో ర్యాలీ కిట్‌ను స్టాండర్డ్‌గా అందించారు. ఈ కిట్‌లో వన్-పీస్ ర్యాలీ సీటు, ర్యాలీ-స్టైల్ రియర్ కౌల్, అల్యూమినియం బ్రేస్‌తో కూడిన ర్యాలీ-స్టైల్ హ్యాండ్‌గార్డ్స్, హై-మౌంటెడ్ ర్యాలీ మడ్‌గార్డ్ వంటి భాగాలు ఉంటాయి. ఈ ర్యాలీ ఫీచర్లు బైక్‌ను మెరుగైన అడ్వెంచర్, ఆఫ్-రోడింగ్ కెపాసిటీ కోసం సిద్ధం చేస్తాయి, దీని వలన రైడర్‌లు కఠినమైన రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించవచ్చు.

మానా బ్లాక్ ఎడిషన్‌లో ఆఫ్-రోడింగ్‌ను మరింత సురక్షితంగా, నమ్మకంగా చేయడానికి ట్యూబ్‌లెస్ టైర్లను అందించారు. ఈ బైక్‌లో క్రాస్-స్పోక్ వీల్స్‌తో పాటు ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చడం అనేది ఆఫ్-రోడింగ్ చేసేటప్పుడు చాలా ఉపయోగకరమైన, ఆచరణాత్మక ఫీచర్. ట్యూబ్‌లెస్ టైర్లు ఉండటం వలన పంక్చర్ అయిన సందర్భంలో రైడర్‌కు ఎక్కువ ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఇది బైక్ స్థిరత్వం, బలాన్ని కూడా పెంచుతుంది.

Tags

Next Story