Royal Enfield : మార్కెట్ పై రాయల్ ఎన్‌ఫీల్డ్ దండయాత్ర..30 రోజుల్లో లక్ష బైక్‌లు అమ్మి రికార్డు.

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ నవంబర్ 2025లో మరో మైలురాయిని అధిగమించింది. ఈ నెలలో కంపెనీ మొత్తం లక్షకు పైగా మోటార్‌సైకిళ్లను అమ్మింది. గత ఏడాది ఇదే సమయానికి విక్రయించిన 82,257 బైక్‌లతో పోలిస్తే, ఈసారి ఏకంగా 22.38 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది. బ్రాండ్ అమ్మకాలలో ఎప్పటిలాగే 350సీసీ సెగ్మెంట్ ఆధిపత్యాన్ని కొనసాగించింది.
350సీసీ సెగ్మెంట్ హవా
నవంబర్ 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం అమ్మకాలలో 90 శాతం వాటా కేవలం 350సీసీ కేటగిరీదే కావడం విశేషం. ఈ కేటగిరీలో 90,312 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది 71,261 యూనిట్లతో పోలిస్తే, ఈ సెగ్మెంట్‌లో 26.73 శాతం అద్భుతమైన వృద్ధి కనిపించింది. ఈ విజయానికి ప్రధాన కారణం క్లాసిక్ 350, బుల్లెట్ 350, హంటర్ 350 వంటి మోడళ్లకు మార్కెట్‌లో నిరంతరంగా పెరుగుతున్న డిమాండే.
350సీసీ పైన స్వల్ప తగ్గుదల
350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సెగ్మెంట్‌లో మాత్రం ఈ ఏడాది స్వల్ప తగ్గుదల నమోదైంది. నవంబర్ 2025లో ఈ సెగ్మెంట్ అమ్మకాలు 10,358 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే నెలలో 10,996 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, దాదాపు 5.8 శాతం తరుగుదల కనిపించింది. అయినప్పటికీ, హిమాలయన్, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, సూపర్ మెటియోర్ 650 వంటి మోటార్‌సైకిళ్లతో ఈ సెగ్మెంట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్లోబల్ బ్రాండ్‌ను, ప్రీమియం స్థానాన్ని పటిష్టం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.
ఆర్థిక సంవత్సరంలో అద్భుత ప్రదర్శన
రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు దేశీయంగానే కాకుండా, మొత్తం ఆర్థిక సంవత్సరంలో కూడా అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాయి. నవంబర్ 2024తో పోలిస్తే దేశీయ విక్రయాలు 25.15 శాతం వృద్ధితో 90,405 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతులు 2.43 శాతం స్వల్ప వృద్ధితో 10,265 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం 2026లో (గత 8 నెలల్లో) కంపెనీ మొత్తం 8,17,524 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాది కంటే ఏకంగా 26.24 శాతం వృద్ధి. ఇందులో 350సీసీ లోపు మోటార్‌సైకిళ్లదే అగ్రస్థానం.
750సీసీ కొత్త సెగ్మెంట్ వైపు
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు 750సీసీ సామర్థ్యం కలిగిన కొత్త ప్రీమియం సెగ్మెంట్‌పై దృష్టి సారించింది. మరింత శక్తివంతమైన, ప్రీమియం ఫీచర్లు ఉన్న ఈ కొత్త మోడళ్లు భారతదేశంలోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో కూడా కంపెనీ బ్రాండ్ విలువను మరింత బలోపేతం చేస్తాయని అంచనా.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

