Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ మాస్టర్ ప్లాన్..ఇక ఇంటికో బైక్ ఖాయం..రికార్డులు తిరగరాయడం ఖాయం.

Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ మాస్టర్ ప్లాన్..ఇక ఇంటికో బైక్ ఖాయం..రికార్డులు తిరగరాయడం ఖాయం.
X

Royal Enfield : బుల్లెట్ బండి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంభీరమైన డుగ్ డుగ్ శబ్దం, రాజసం ఉట్టిపడే లుక్కుతో కుర్రకారు నుంచి ముసలివారి వరకు అందరినీ ఆకట్టుకునే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు సరికొత్త రికార్డుల దిశగా అడుగులు వేస్తోంది. మార్కెట్లో బుల్లెట్లకు పెరుగుతున్న విపరీతమైన డిమాండ్‌ను తట్టుకోవడానికి కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏకంగా 20 లక్షల యూనిట్లకు పెంచాలని భారీ స్కెచ్ వేసింది. ఇందుకోసం సుమారు రూ.958 కోట్ల భారీ పెట్టుబడిని సిద్ధం చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్రలో 2025 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. కంపెనీ చరిత్రలోనే మొదటిసారిగా ఏడాదికి 10,71,809 బైక్‌లను విక్రయించి రికార్డు సృష్టించింది. కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా, విదేశాల్లోనూ రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ ఇమేజ్ భారీగా పెరిగింది. గత ఏడాది సుమారు 1,32,132 మోటార్‌సైకిళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం దీని ప్రపంచవ్యాప్త పాపులారిటీకి నిదర్శనం. ప్రస్తుతం ఉన్న 14.6 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం దాదాపు పూర్తిగా వినియోగించబడుతుండటంతో, కొత్త ప్లాన్ అవసరమైంది.

ఈ విస్తరణ ప్రాజెక్టులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇందుకోసం అవసరమైన రూ.958 కోట్లను కంపెనీ ఎటువంటి బాహ్య రుణాలు లేకుండా తన సొంత నిధుల నుంచే ఖర్చు చేయనుంది. తమిళనాడులోని చెయ్యార్ ప్లాంట్‌లో అదనంగా 5.4 లక్షల యూనిట్ల సామర్థ్యాన్ని జోడించనున్నారు. అంటే ప్రస్తుత ఉత్పత్తి కంటే సుమారు 37 శాతం వృద్ధి చెందనుంది. ఈ ప్రాజెక్టు 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రారంభమై, 2028 నాటికి పూర్తి కానుంది.

సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లేదా హిమాలయన్ వంటి మోడళ్లను బుక్ చేసుకుంటే డెలివరీ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఉత్పత్తి సామర్థ్యం 20 లక్షలకు పెరగడం వల్ల కస్టమర్లకు తమ అభిమాన బైక్ త్వరగా అందే అవకాశం ఉంది. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో 450cc, 650cc విభాగాల్లో మరిన్ని కొత్త మోడళ్లను ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. మిడ్-సైజ్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో ఇప్పటికే తిరుగులేని మహారాజుగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్, ఈ మెగా ఇన్వెస్ట్‌మెంట్‌తో ప్రపంచ మార్కెట్‌ను ఏలాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Tags

Next Story