Rupee vs Dollar: ఆర్బీఐ దెబ్బకు డాలర్ ఢమాల్.. మళ్లీ పుంజుకున్న రూపాయి.

Rupee vs Dollar : గత వారం చివరి ట్రేడింగ్ రోజున రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయిన భారత రూపాయి, కొత్త వారం ప్రారంభంలో బలంగా పుంజుకుంది. సోమవారం ఉదయం మార్కెట్ తెరవగానే రూపాయి విలువ 49 పైసలు పెరిగి, ఒక డాలర్‌తో పోలిస్తే రూ. 89.17 వద్ద ట్రేడ్ అవ్వడం ప్రారంభించింది. ఇది ఉదయం రూ.89.46 వద్ద ప్రారంభమైనప్పటికీ, డాలర్‌తో పోలిస్తే మెరుగైన రికవరీని చూపించింది. అంతకుముందు రోజు ముగింపు ధరతో పోలిస్తే రూపాయి దాదాపు 50పైసలు బలం పుంజుకోవడానికి ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం ప్రధాన కారణమైంది.
గతవారం ప్రపంచ, దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీగా అమ్మకాలు జరగడం, వ్యాపార అనిశ్చితుల కారణంగా డాలర్‌కు డిమాండ్ పెరిగింది. ఫలితంగా శుక్రవారం రూపాయి 98 పైసలు పతనమై చారిత్రక కనిష్ట స్థాయి రూ.89.66 వద్ద ముగిసింది. అయితే ఈ ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, సోమవారం రూపాయి బలంగా పుంజుకుంది. రూపాయి బలపడటానికి ముఖ్య కారణం బ్యారెల్‌కు 0.10 శాతం తగ్గి $62.50 కి చేరుకున్న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు. భారత్ మొత్తం దిగుమతి వ్యయంలో అధిక భాగం చమురుపైనే ఖర్చు అవుతుంది కాబట్టి, క్రూడ్ ధరల తగ్గుదల రూపాయికి సానుకూల అంశంగా మారింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో కూడా సానుకూల ధోరణి కనిపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 218.44 పాయింట్లు పెరిగి 85,450.36 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 69.4 పాయింట్లు పెరిగి 26,137.55 వద్ద ప్రారంభమైంది. మార్కెట్లలో ఈ రికవరీ కూడా రూపాయికి మద్దతునిచ్చింది. డాలర్ ఇండెక్స్ (ఆరు ప్రధాన కరెన్సీల ముందు డాలర్ బలాన్ని సూచించేది) స్వల్పంగా పెరిగి 100.18 వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ, రూపాయి మెరుగైన ప్రదర్శన కనబరిచింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు శుక్రవారం కూడా సుమారు రూ.1,766 కోట్ల విలువైన అమ్మకాలు కొనసాగించారు. విదేశీ పెట్టుబడిదారుల వైఖరి ఇంకా జాగ్రత్తగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటం, చమురు ధరలు తగ్గడం రూపాయికి కొంత ఊరటనిచ్చింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

