Gold And Fuel Rates: త్వరలోనే పెట్రోల్, డీజిల్‌తో పాటు బంగారం ధరలు పెంపు.. ఏకంగా రూ.56 వేలకు..

Gold And Fuel Rates: ఉక్రెయిన్‌లో యుద్ధమేమో గాని.. ప్రపంచ దేశాలపై ఆ ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇండియాలో ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే వంటనూనె ధరలు పెరిగాయి. హోటళ్లు, ఇతర అవసరాలకు వాడుకునే గ్యాస్ ధర పెరిగింది. రేపు సాయంత్రం తరువాత ఏ క్షణాన్నైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు. ఇక బంగారం ధర అయితే 56వేల రూపాయలకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి.
యుద్ధం కారణంగా రూపాయి విలువ దారుణంగా పడిపోతుండడంతో.. విదేశాల నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువు ధరా పెరుగుతోంది. ముఖ్యంగా పప్పు దినుసుల ధరలు సైతం పెరగబోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే మరింత భారం పెరుగుతుంది. వాటర్ క్యాన్, పాల ప్యాకెట్, కూరగాయలతో సహా నిత్యావసర వస్తువులన్నింటిపై ఆ ప్రభావం కనిపిస్తుంది.
ఇక పసిడి ధరలు ఏ రేంజ్‌కు పెరుగుతాయోనన్న ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే అమ్మకాలు తగ్గాయి. యుద్ధం మొదలైన ఈ 11 రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర ఏకంగా ఆరువేల రూపాయలు పెరిగింది. మొన్నటి వరకు 48వేల రూపాయలు పలికిన పది గ్రాముల పసిడి ధర ఇప్పుడు 54వేల రూపాయలకు చేరింది. జస్ట్ పది రోజుల వ్యవధిలో బంగారం ధర ఇంతలా పెరగడం గతంలో ఎన్నడూ లేదు.
అందుకే, బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. అయితే పెట్టుబడి రూపంలో మాత్రం బంగారాన్ని బాగానే కొంటున్నారు. రూపాయి విలువ పతనం అవడం, స్టాక్ మార్కెట్లు నేలచూపులు చూస్తుండడంతో ఈ సమయంలో మంచి రాబడి రావాలంటే బంగారమే బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు. నగలు, అవసరాల కోసం బంగారం కొనడం తగ్గినా, ఇన్వెస్ట్‌మెంట్ యాంగిల్‌లో మాత్రం కొనుగోళ్లు పెరిగాయి.
బంగారం ధర పెరగడానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు విశ్లేషకులు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఆపేస్తే తప్ప బంగారం ధరలు దిగొచ్చే పరిస్థితి లేదంటున్నారు. లేదంటే 56వేలు కాదు పది గ్రాముల పసిడి ఏకంగా 58వేల రూపాయలకు ఎగబాకవచ్చని చెబుతున్నారు. అందులోనూ క్రూడాయిల్ ధర వంద డాలర్లు దాటింది.
ఈ భారాన్ని సామాన్యులపై వేయడానికి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. దీనికారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి కాబట్టి.. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇన్వెస్టర్లు బంగారాన్నే పెట్టుబడిసాధనంగా ఎంచుకుంటారని విశ్లేషిస్తున్నారు. ఎటుచూసినా.. వంటనూనెల నుంచి బంగారం వరకు అన్నింటి ధరలు పెరగడానికి రష్యా-ఉక్రెయిన్ వార్ కారణమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com