Post Office Scheme : రోజుకు రూ.416 పొదుపు చేస్తే రూ. 1.03 కోట్లు.. కేవలం వడ్డీ నుంచే రూ. 65.5 లక్షలు.

Post Office Scheme : పోస్టాఫీస్ పథకాల ప్రత్యేకత ఏమిటంటే.. వాటిలో లభించే వడ్డీ రేటు బాగుండటంతో పాటు, చాలా పథకాలకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. సరైన ప్రణాళికతో ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే, పదవీ విరమణ సమయానికి భారీ మొత్తాన్ని కూడబెట్టవచ్చు. అంతేకాకుండా పెన్షన్ లాంటి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన పథకమే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). ఇది ప్రభుత్వ హామీ ఉన్నందున, ఇందులో మీ పెట్టుబడికి ఎలాంటి రిస్క్ ఉండదు, అంటే పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.
PPF అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక లాంగ్ టర్మ్ పెట్టుబడి పథకం. దీని మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం సుమారు 7.1% వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ ప్రతి సంవత్సరం పన్ను రహితం కావడం దీని ప్రత్యేకత. పీపీఎఫ్ లో మీరు ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. మీరు నెలకు రూ.12,500 చొప్పున లేదా రోజుకు సుమారు రూ.416 ఆదా చేయడం ద్వారా ఈ వార్షిక పెట్టుబడిని పూర్తి చేయవచ్చు. ఈ పెట్టుబడిని దీర్ఘకాలం కొనసాగిస్తే, రిటైర్మెంట్ సమయానికి మంచి మొత్తాన్ని జమ చేసుకోవచ్చు.
మీరు 15 సంవత్సరాల పాటు PPF లో సంవత్సరానికి రూ.1.5 లక్షలు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో మీకు సుమారు రూ.41.35 లక్షలు లభిస్తాయి. ఇందులో మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.22.50 లక్షలు కాగా, మిగిలిన మొత్తం (దాదాపు రూ.18.85 లక్షలు) వడ్డీ రూపంలో వస్తుంది.
పెట్టుబడి కాలాన్ని 20 సంవత్సరాలకు పెంచితే, మొత్తం సుమారు రూ.67.69 లక్షలకు చేరుకుంటుంది. ఇందులో వడ్డీ ద్వారా రూ.37.69 లక్షలు వస్తాయి. ఇక 25 సంవత్సరాల పాటు నిరంతరంగా పెట్టుబడి పెడితే, మీ మొత్తం రూ.1.03 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఇందులో మీ మొత్తం పెట్టుబడి రూ.37.5 లక్షలు కాగా, కేవలం వడ్డీ ద్వారానే మీరు రూ.65.5 లక్షల భారీ మొత్తాన్ని ఆర్జించినట్లు అవుతుంది.
ఈ పథకంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. చిన్న మొత్తాలను పొదుపు చేయడం ద్వారా కూడా ఇందులో భారీ ప్రయోజనం పొందవచ్చు. రిస్క్ తీసుకోడానికి భయపడే, నమ్మకమైన ఆదాయాన్ని కోరుకునే వారికి ఈ పథకం చాలా లాభదాయకం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com