Digital Gold : పేటీఎం, ఫోన్‌పే వంటి యాప్‌లలో గోల్డ్ కొంటున్నారా?..తస్మాత్ జాగ్రత్త.

Digital Gold : ఇటీవల కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో చాలా మంది పెట్టుబడిదారులు డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ డిజిటల్ గోల్డ్ పెట్టుబడుల భద్రతపై గత కొద్ది రోజులుగా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) కీలక హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 8న సెబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు ఏ విధమైన చట్టపరమైన పర్యవేక్షణ పరిధిలోకి రావు కాబట్టి, ఇది చాలా ప్రమాదకరం కావచ్చని ఇన్వెస్టర్లను హెచ్చరించింది.
బంగారం ధరలు పెరగడం, సులభంగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉండటంతో డిజిటల్ గోల్డ్ పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారింది. అయితే, సెబీ ఈ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. "కొన్ని ఆన్‌లైన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు పెట్టుబడిదారులకు డిజిటల్ గోల్డ్ లేదా ఇ-గోల్డ్ ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సెబీ దృష్టికి వచ్చింది. ఇవి ఫిజికల్ గోల్డ్‌కు ప్రత్యామ్నాయంగా ప్రచారం అవుతున్నాయి" అని సెబీ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది.
ఈ డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ ద్వారా నియంత్రించబడే సెక్యూరిటీలు లేదా కమోడిటీ డెరివేటివ్‌లుగా పరిగణలోకి రావు. అంటే, అవి సెబీ పర్యవేక్షణకు వెలుపల పనిచేస్తున్నాయి. సెబీ ప్రకారం, డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల పెట్టుబడిదారులు తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ స్కీమ్‌లలో మీ డబ్బుకు బదులుగా భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసే సంస్థ (ఉదా: MMTC-PAMP, SafeGold) మోసం చేసినా లేదా దివాలా తీసినా, పెట్టుబడిదారుల డబ్బును తిరిగి పొందేందుకు చట్టపరమైన అవకాశం ఉండదు.
డిజిటల్ గోల్డ్ అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు (యాప్‌లు) విఫలమైనా లేదా హ్యాక్ అయినా, పెట్టుబడిదారులకు తమ డబ్బు తిరిగి రావడం కష్టం. అలాంటి సందర్భాల్లో సెబీ లేదా ఆర్బీఐ వంటి నియంత్రణ సంస్థలు కూడా నిస్సహాయంగా మారవచ్చు. బ్యాంక్‌లలో రూ.5 లక్షల వరకు ఆర్బీఐ గ్యారంటీ ఇస్తున్నట్లుగా, డిజిటల్ గోల్డ్‌లో మీ పెట్టుబడికి ఎటువంటి నియంత్రణ గ్యారంటీ ఉండదు. అందుకే ఇది ప్రమాదకరమని సెబీ హెచ్చరించింది.
పేటీఎం, ఫోన్‌పే వంటి ప్రముఖ డిజిటల్ యాప్‌లు ఈ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లను అందిస్తున్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయంటే: ఈ ప్లాట్‌ఫామ్‌లు MMTC-PAMP, SafeGold, IDBI ట్రస్టీషిప్, బ్రింక్స్ ఇండియా వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాయి. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బును MMTC-PAMP లేదా SafeGold వంటి సంస్థలు భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తాయి.
ఈ బంగారం కొనుగోలు, నిల్వ చేసే పనిని సాధారణంగా బ్రింక్స్ ఇండియా వంటి సంస్థలు నిర్వహిస్తాయి. మీరు పెట్టుబడిని విక్రయించినప్పుడు, ఈ సంస్థలు ఫిజికల్ గోల్డ్‌ను అమ్మి, మీకు రిటర్న్ అందిస్తాయి. డిజిటల్ గోల్డ్‌కు బదులుగా, సెబీ నియంత్రణలో ఉన్న వ్యవస్థల్లో పెట్టుబడి పెట్టడం సురక్షితమని సెబీ సూచించింది. అవి గోల్డ్ ఈటీఎఫ్‌లు, సిల్వర్ ఈటీఎఫ్‌లు, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్. ఈ ప్రత్యామ్నాయాలను సెబీ నియంత్రిత మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తాయి. ఇవి సెబీ నియమాలకు లోబడి ఉంటాయి కాబట్టి, పెట్టుబడికి కొంతవరకు భద్రత ఉంటుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

