Car Sale : పాత కారు అమ్మేటప్పుడు జాగ్రత్త.. ఈ 5 విషయాలు గుర్తుంచుకోకపోతే మీకే ముప్పు!

Car Sale : పాత కారు అమ్మేటప్పుడు జాగ్రత్త.. ఈ 5 విషయాలు గుర్తుంచుకోకపోతే మీకే ముప్పు!
X

Car Sale : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు ఘటన తర్వాత, పాత కార్లను కొనుగోలు-అమ్మకం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ మొదలైంది. పేలుడుకు గురైన కారు అనేక చేతులు మారింది. ఇటువంటి సందర్భాలలో కారును విక్రయించిన పాత యజమాని ఇబ్బందుల్లో పడకుండా ఉండాలంటే, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరి. కేవలం డబ్బు తీసుకుని తాళాలు ఇవ్వడం మాత్రమే అమ్మకం కాదు, చట్టపరంగా ఆ యజమాన్య హక్కులను మార్చడం కూడా ముఖ్యమైనది. మీరు పాత కారు అమ్ముతున్నట్లయితే, ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పక పాటించాల్సిన విషయాలు తెలుసుకోండి.

పాత కారు అమ్మకం అంటే డబ్బు, తాళాలు మార్చుకోవడం మాత్రమే కాదు. ఇది వాహనం యజమాన్య హక్కు, బాధ్యతను మరొక వ్యక్తికి అప్పగించే ఒక చట్టపరమైన ప్రక్రియ. ఓనర్షిప్ ట్రాన్సఫర్ సరిగా పూర్తి చేయకపోతే, కొత్త యజమాని చేసిన ట్రాఫిక్ చలాన్‌లు లేదా వాహనంతో సంబంధం ఉన్న ఏదైనా నేరపూరిత కార్యకలాపాలకు పాత యజమాని బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎర్రకోట పేలుడు వంటి సంఘటనలు జరిగినప్పుడు, రికార్డులలో ఉన్న పాత యజమానికే మొదట పోలీసులు బాధ్యత వహిస్తారు.

తప్పక గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

మీరు పాత కారు అమ్మేటప్పుడు, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ క్రింది ముఖ్యమైన విషయాలను తప్పకుండా పాటించాలి:

1. అన్ని పత్రాలను కంప్లీట్ చేయండి : కేవలం మాటల ఒప్పందంపై ఆధారపడకండి. అమ్మకం సమయంలో ఫామ్ 29, ఫామ్ 30తో సహా అన్ని అవసరమైన ఆర్‌టీఓ పత్రాలను ఇద్దరు వ్యక్తులతో (అమ్మకందారు,కొనుగోలుదారు) పూర్తి చేయించి, సంతకాలు తీసుకోవాలి.

2. కొనుగోలుదారు గుర్తింపు పత్రాలు: కొనుగోలుదారు ప్రభుత్వ గుర్తింపు రుజువు (ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి), చిరునామా రుజువు కాపీని తప్పకుండా తీసుకోవాలి.

3. డెలివరీ రసీదు : మీరు నిర్ణీత తేదీ, సమయానికి కారు, దానికి సంబంధించిన అన్ని పత్రాలను కొనుగోలుదారుడికి అప్పగించినట్లు ధృవీకరిస్తూ, డెలివరీ రసీదు పై కొనుగోలుదారు సంతకం తీసుకోవాలి.

4. ట్రాన్స్‌ఫర్ ప్రక్రియను ట్రాక్ చేయండి: కారు అమ్మినంత మాత్రాన మీ బాధ్యత ముగియదు. కొనుగోలుదారు ఆర్‌టీఓలో పేరు మార్పిడి ప్రక్రియను ప్రారంభించారా లేదా అని చెక్ చేయండి. బదిలీ పూర్తయ్యే వరకు కాలానుగుణంగా ఫాలో-అప్ చేస్తూ ఉండాలి.

5. బీమా కంపెనీకి తెలియజేయాలి : కారు విక్రయం గురించి మీ బీమా కంపెనీకి వెంటనే తెలియజేయాలి. తద్వారా వారు పాలసీని రద్దు చేయడం లేదా మీ నో క్లెయిమ్ బోనస్ ను బదిలీ చేయడం వంటి ప్రక్రియలు పూర్తి చేస్తారు.

Tags

Next Story