Stock Market Crash : ఇన్వెస్టర్లకు బ్లాక్ ఫ్రైడే.. ఒక్క రోజే లక్షల కోట్ల సంపద ఆవిరి.

Stock Market Crash : ఇన్వెస్టర్లకు బ్లాక్ ఫ్రైడే.. ఒక్క రోజే లక్షల కోట్ల సంపద ఆవిరి.
X

Stock Market Crash : భారత స్టాక్ మార్కెట్ మదుపరులకు ఈ వారం ఒక పీడకలలా మారుతోంది. గురువారం నాటి భారీ పతనం నుంచి కోలుకోకముందే, నేడు మార్చి 13, శుక్రవారం ఉదయం మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే దలాల్ స్ట్రీట్ రక్తసిక్తమైంది. అమ్మకాల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందంటే, స్క్రీన్లన్నీ ఎరుపు రంగులోకి మారిపోయి ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు మన మార్కెట్‌ను పాతాళానికి తొక్కేస్తున్నాయి.

ఉదయం 9:21 గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ ఏకంగా 672 పాయింట్లు నష్టపోయి 75,362 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 205 పాయింట్ల భారీ పతనంతో 23,430 స్థాయికి పడిపోయింది. మార్కెట్లు ప్రారంభంలోనే గ్యాప్-డౌన్ తో మొదలవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీసింది. ఒక్కమాటలో చెప్పాలంటే, మార్కెట్లో ప్రస్తుతం బేర్స్ హవా నడుస్తోంది.

అసలు ఇన్వెస్టర్లు ఇంతలా ఎందుకు భయపడుతున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనడమే. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఆయిల్ సప్లై దెబ్బతింటుందనే ఆందోళన మొదలైంది. భారత్ వంటి దేశం తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి, క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే మన కంపెనీల లాభాలు తగ్గిపోతాయి. ఇది కాస్తా ద్రవ్యోల్బణానికి దారితీసి సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుందనే భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.

ఈ పతనం కేవలం ఒక రంగానికే పరిమితం కాలేదు. ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, మీడియా, మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. డిఫెన్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కూడా అమ్మకాల సెగ గట్టిగా తగులుతోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లను విక్రయించడం కూడా మార్కెట్ పతనానికి ఆజ్యం పోస్తోంది. మొత్తానికి ఈ వారాంతం ఇన్వెస్టర్లకు చేదు అనుభవాన్నే మిగిల్చేలా కనిపిస్తోంది.

Tags

Next Story