Silver Price : బంగారం దూకుడు తగ్గింది.. దీపావళి తర్వాత వెండిదే రికార్డు.

Silver Price : సాధారణంగా పెట్టుబడిదారులు బంగారంపై ఎక్కువ మక్కువ చూపిస్తారు. కానీ, గడిచిన రెండు నెలల్లో వెండి ఇచ్చిన రాబడి చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఏడాది దీపావళి (అక్టోబర్ 20) నుంచి డిసెంబర్ 22 వరకు బంగారం కేవలం 4.68 శాతం లాభాన్ని మాత్రమే ఇవ్వగా, వెండి మాత్రం ఏకంగా 34.74 శాతం రాబడిని అందించింది. అంటే బంగారంతో పోలిస్తే వెండి దాదాపు ఏడు రెట్లు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టింది. మంగళవారం (డిసెంబర్ 23) కూడా వెండి ధర కొత్త గరిష్ట స్థాయిని తాకింది.
వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా పారిశ్రామిక అవసరాలు పెరగడమే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి వినియోగం ఎక్కువగా ఉండటం, మార్కెట్లో సరఫరా తక్కువగా ఉండటంతో ధరలు భగ్గుమంటున్నాయి. దీనికి తోడు సురక్షితమైన పెట్టుబడిగా భావించి ఇన్వెస్టర్లు వెండి వైపు మొగ్గు చూపడం కూడా ధరల పెరుగుదలకు దారితీస్తోంది. గడిచిన 60 రోజుల్లోనే కిలో వెండిపై ఏకంగా రూ. 54,885 పెరగడం గమనార్హం.
ధరల వ్యత్యాసాన్ని గమనిస్తే, అక్టోబర్ 20న రూ. 1,30,624 ఉన్న 10 గ్రాముల బంగారం ధర, డిసెంబర్ 22 నాటికి రూ. 1,36,744 కి చేరింది. అంటే సుమారు రూ. 6,120 పెరిగింది. అదే సమయంలో కిలో వెండి ధర రూ. 1,57,987 నుండి ఏకంగా రూ. 2,12,872 కి ఎగబాకింది. డిసెంబర్ 23 ఉదయం ట్రేడింగ్‌లో వెండి ధర రూ. 2,16,596 వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసింది. వెండిలో కనిపిస్తున్న ఈ వేగం బంగారంలో కనిపించకపోవడం గమనార్హం.
వెండి ధరలు ఇక్కడితో ఆగుతాయా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. వెల్త్ మేనేజ్‌మెంట్ నిపుణుల అంచనా ప్రకారం.. మార్చి 2026 నాటికి కిలో వెండి ధర రూ. 2.50 లక్షల మార్కును చేరుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి ఇది మరో 16 శాతం పెరగాల్సి ఉంటుంది. డిమాండ్, సరఫరా మధ్య ఉన్న అసమతుల్యత కారణంగా ధరలు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు వెండి ఒక అద్భుతమైన ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

