Silver Price : కలకలం రేపుతున్న తెల్ల బంగారం.. రూ.2.07 లక్షల మార్కును దాటిన వెండి ధర.

Silver Price : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెల్ల తుఫాన్ వీస్తోంది. అది మరేంటో కాదు వెండి ధరల గురించి. గత కొంతకాలంగా వెండి ధరల్లో అనూహ్యమైన పెరుగుదల కనిపిస్తోంది. మంగళవారం రోజు వెండి ధర రూ.2.07 లక్షల మార్కును దాటింది. అంతేకాదు ట్రేడింగ్ సెషన్ మధ్యలో వెండి సరికొత్త జీవితకాల రికార్డును కూడా నెలకొల్పింది. వెండి ధరలు ఇలా పెరగడానికి అనేక బలమైన కారణాలు ఉన్నాయి.
వెండి ధరల పెరుగుదలకు ప్రధాన 4 కారణాలు
పారిశ్రామిక, పెట్టుబడి డిమాండ్ పెరుగుదల: పారిశ్రామిక అవసరాలతో పాటు పెట్టుబడి కోసం వెండిని కొనుగోలు చేసే డిమాండ్ పెరగడం ప్రధాన కారణం.
సరఫరా, ఉత్పత్తిలో తగ్గుదల: ప్రపంచవ్యాప్తంగా వెండి సరఫరా, ఉత్పత్తి వరుసగా ఐదో సంవత్సరం కూడా తగ్గడం ధరలను పెంచుతోంది.
భారత కరెన్సీ పతనం: డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోవడం వలన, డాలర్‌లలో ధర నిర్ణయించబడే వెండి వంటి వస్తువుల ధరలు రూపాయలలో పెరుగుతున్నాయి. ఈ ఏడాది రూపాయి విలువ సుమారు 6 శాతం పడిపోయింది.
ఫెడ్ రేటు కోత అంచనాలు: అమెరికా జాబ్ డేటా బలహీనంగా ఉండటం వలన, రాబోయే రోజుల్లో ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు తగ్గితే, వెండి వంటి విలువైన లోహాల డిమాండ్ మరింత పెరుగుతుంది.
బంగారం కంటే మెరుగైన ప్రదర్శన
ఇటీవలి కాలంలో విలువైన లోహాల విభాగంలో వెండి బంగారాన్ని కూడా మించిపోయింది. కామెక్స్ ఫ్యూచర్స్‌లో వెండి ధర తొలిసారిగా ఔన్సుకు $66 మార్కును దాటింది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం..చారిత్రక ధోరణిని పరిశీలిస్తే, విలువైన లోహాల మార్కెట్‌లో ముఖ్యమైన వృద్ధి కనిపించిన ప్రతిసారీ, వెండి ఎప్పుడూ బంగారం కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తుంది.
ముడి చమురును కూడా అధిగమించిన వెండి
వెండి ధరలు ముడి చమురు ధరలను కూడా అధిగమించడం ఒక ముఖ్యమైన పరిణామం. వెండి ధర $65 మార్కును దాటడం అనేది ఒక కొత్త శకానికి నాంది పలికింది. గత 40 ఏళ్లలో మొదటిసారిగా వెండి ముడి చమురును వెనక్కి నెట్టింది. దీని అర్థం, పారిశ్రామిక అవసరాల కోసం వెండి వ్యూహాత్మకంగా ఇంధనంతో సమానంగా ముఖ్యమైన లోహంగా మారుతోంది. అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగిత రేటు (ప్రస్తుతం 4.6 శాతం) కారణంగా 2026లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు కూడా వెండి డిమాండ్‌ను పెంచుతున్నాయి.
వెండి ధరల తాజా వివరాలు
దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ అయిన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో మంగళవారం వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రాత్రి ఆలస్యంగా వెండి ధర రూ.2,07,833 తో జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. మార్కెట్ ముగిసే సమయానికి రూ.2,07,435 వద్ద స్థిరపడింది. అయితే, గురువారం ఉదయం 9:40 గంటల సమయంలో, వెండి ధర స్వల్పంగా రూ.453 తగ్గి రూ.2,06,982 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గి రూ.1,34,770 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

