Diwali Sales : ఆరు లక్షల కోట్లు.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన దీపావళి అమ్మకాలు.

Diwali Sales : ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అందించిన సమాచారం ప్రకారం, 2025 దీపావళి పండుగ అమ్మకాలలో ఏకంగా 6.05 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఇందులో వస్తువుల వ్యాపారం 5.40 లక్షల కోట్ల రూపాయలు కాగా, సేవల వ్యాపారం 65,000 కోట్ల రూపాయలుగా నమోదైంది.
గతంలో ఏ సంవత్సరంలోనూ దీపావళి సీజన్‌లో 6 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరగలేదు. ఆ స్థాయిలో ఈసారి కొత్త రికార్డు క్రియేట్ అయింది. గత ఏడాది (2024) దీపావళి సీజన్‌లో 4.25 లక్షల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది అమ్మకాలు 25 శాతం పెరిగాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక మంచి సూచికగా భావిస్తున్నారు.
ఈ దీపావళి అమ్మకాలలో రోజువారీ వినియోగ వస్తువులతో సహా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వాటా 12 శాతంగా ఉంది. బంగారం, ఆభరణాల అమ్మకాల వాటా 10 శాతంగా నమోదైంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ (టీవీలు, రిఫ్రిజిరేటర్లు వంటివి), రెడీమేడ్ దుస్తులు, బహుమతుల వస్తువుల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి.
ఇక, ఇంటి అలంకరణ, ఫర్నిచర్ మొదలైన వాటి అమ్మకాలు 10 శాతం కాగా, తీపి వస్తువులు 5 శాతం, పూజా వస్తువులు 3 శాతం, పండ్లు 4 శాతం అమ్మకాలు నమోదు చేశాయని సీఏఐటీ విడుదల చేసిన పరిశోధన నివేదికలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులను సర్వే చేసి ఈ గణాంకాలను విడుదల చేశారు. జీఎస్టీ ధరలు తగ్గడం వల్ల వ్యాపారం పెరిగి ఉండవచ్చు అని 72 శాతం మంది వర్తకులు అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వ విధానాలు వ్యాపార రంగానికి ఎలా తోడ్పడుతున్నాయో తెలియజేస్తుంది. పన్నుల తగ్గింపు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు, వ్యాపారులకు కూడా ఎక్కువ అమ్మకాలను తెచ్చిపెట్టింది.
సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ప్రకారం.. కార్పొరేట్, వ్యవసాయ రంగం కాకుండా, దేశంలో ఉన్న 9 కోట్ల చిన్న వ్యాపారాలు, లక్షలాది ఉత్పత్తి యూనిట్లు భారతదేశ అభివృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా ఉన్నాయి. వీరి వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. దారిద్య్ర నిర్మూలనలోనూ, ఉద్యోగ కల్పనలోనూ ఈ చిన్న పరిశ్రమల పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన నొక్కి చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com