Skoda Kushaq : కారు కొనాలనుకుంటున్నారా? అయితే కొంచెం ఆగండి..స్కోడా కారు వచ్చేస్తోంది.

Skoda Kushaq : ఆటోమొబైల్ ప్రేమికులకు స్కోడా కంపెనీ అదిరిపోయే న్యూస్ చెప్పింది. భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన తన మిడ్-సైజ్ ఎస్‌యూవీ కుషాక్ కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ 2026కు సంబంధించిన మొదటి టీజర్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. సరికొత్త లుక్, మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రాబోతున్న ఈ కారు, ఎస్‌యూవీ ప్రియులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. గ్రీన్ కలర్ కవర్‌లో దాగి ఉన్న ఈ కారు టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్కోడా కుషాక్ 2026 వెర్షన్‌లో డిజైన్ పరంగా భారీ మార్పులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా దీని ఫ్రంట్ లుక్, కంపెనీ ఇటీవల విడుదల చేసిన కైలాక్ ఎస్‌యూవీని పోలి ఉంటుందని తెలుస్తోంది. రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌లైట్లు, పెద్ద ఫాగ్ ల్యాంప్స్ దీనికి కొత్త గంభీరమైన రూపాన్ని ఇస్తాయి. వీటితో పాటు కోడియాక్ మోడల్ నుంచి స్ఫూర్తి పొందిన కనెక్టెడ్ డిఆర్ఎల్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను తీసుకురానున్నాయి.
కొత్త కుషాక్ కేవలం డిజైన్ లోనే కాదు, ఫీచర్ల విషయంలో కూడా తగ్గేదేలే అంటోంది. ఈసారి ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, అత్యంత కీలకమైన లెవల్ 2 ADAS (ఆటోనమస్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్) ఉండబోతున్నాయి. దీనివల్ల ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది. లోపల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, కొత్త రకం ఇంటీరియర్ ఫినిషింగ్ ఉండబోతున్నాయి. లగ్జరీ కార్లలో ఉండే ఫీచర్లను స్కోడా ఇప్పుడు కుషాక్‌లో ప్రవేశపెడుతోంది.
మెకానికల్ పరంగా చూస్తే ఇంజిన్ లో ఎలాంటి మార్పులు లేవు. పాత కుషాక్‌లో ఉన్న 1.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్, 1.5 లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్లే ఇందులోనూ ఉండనున్నాయి. 1.0 లీటర్ ఇంజిన్ 115 హార్స్‌పవర్ ఇస్తుండగా, 1.5 లీటర్ ఇంజిన్ ఏకంగా 150 హార్స్‌పవర్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్, 7-స్పీడ్ డిసిటి (DCT) వంటి గేర్ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం స్కోడా కుషాక్ ధర రూ.10.66 లక్షల నుంచి రూ.18.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. కొత్త ఫీచర్లు యాడ్ అవుతున్నాయి కాబట్టి, ఫేస్‌లిఫ్ట్ మోడల్ ధర కొంచెం పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో ఇది నేరుగా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్, టాటా సియెరా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ వాల్యూ ఉన్న స్కోడా, ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ తో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మళ్ళీ రారాజుగా నిలవాలని చూస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

