Skoda Kushaq : అదిరిపోయే లుక్‌తో కుషాక్ ఫేస్‌లిఫ్ట్ రెడీ..క్రెటా కోటను బద్దలు కొట్టేలా కొత్త ప్లాన్

Skoda Kushaq : అదిరిపోయే లుక్‌తో కుషాక్ ఫేస్‌లిఫ్ట్ రెడీ..క్రెటా కోటను బద్దలు కొట్టేలా కొత్త ప్లాన్
X

Skoda Kushaq : యూరప్ దిగ్గజం స్కోడా తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ కుషాక్‎కు సరికొత్త హంగులు అద్ది మార్కెట్లోకి వదులుతోంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రేపు అధికారికంగా ఆవిష్కరించబోతోంది. అయితే, దీనికి సంబంధించిన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా కార్ల టీజర్లు స్టూడియోలో షూట్ చేస్తారు, కానీ స్కోడా మాత్రం పూర్తి దేశీ స్టైల్‌లో పచ్చని ఆవాల పొలాల్లో షూట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి దిగ్గజాలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

స్కోడా ఇండియా విడుదల చేసిన తాజా టీజర్ చూస్తుంటే బాలీవుడ్ క్లాసిక్ సినిమా దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సీన్ గుర్తుకు వస్తుంది. పచ్చని ఆవాల పొలంలో, కారును ఆకుపచ్చని వస్త్రంతో కప్పి ఉంచారు. Get ready to fall in love అనే క్యాప్షన్ కూడా జోడించారు. అంటే ఈ కారును చూస్తే ఎవరైనా ప్రేమలో పడాల్సిందే అన్నంత కాన్ఫిడెంట్‌గా ఉంది కంపెనీ. కేవలం కారు డిజైన్ మాత్రమే కాదు, ఆ కారుకు ఇచ్చే బ్రాండింగ్ కూడా కొత్తగా ఉండాలని స్కోడా ప్లాన్ చేస్తోంది. ఈసారి కేవలం లుక్స్ మాత్రమే కాదు, ఫీచర్ల పరంగా కూడా క్రెటా కంటే ఒక మెట్టు పైనే ఉండాలని స్కోడా భావిస్తోంది.

టీజర్‌ను గమనిస్తే కారులో చాలా కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ భాగం పూర్తిగా మారిపోయింది. కారు ముందు భాగంలో ఒక చివర నుంచి మరో చివర వరకు వెలిగే ఫుల్-విడ్త్ ఎల్ఈడీ డిఆర్ఎల్ స్ట్రిప్ వచ్చే అవకాశం ఉంది. స్కోడా సిగ్నేచర్ గ్రిల్ డిజైన్‌ను మరింత షార్ప్‌గా, గంభీరంగా మార్చారు. వెనుక వైపు టెయిల్‌గేట్‌పై ఉన్న స్కోడా అనే అక్షరాలు కూడా ఇప్పుడు ఎల్ఈడీ వెలుగులతో మెరిసిపోతున్నాయి. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్ ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో హైలైట్‌గా నిలవనుంది. దీనివల్ల కారు వెనుక నుంచి చూసినప్పుడు చాలా వైడ్‌గా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది.

స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో ఈసారి భద్రతకు పెద్ద పీట వేశారు. టాప్ వేరియంట్లలో లెవల్-2 అడాస్ ఫీచర్లను జోడించనున్నారు. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి సదుపాయాలు ఉంటాయి. 1.5 లీటర్ టీఎస్ఐ వేరియంట్‌లో వెనుక చక్రాలకు కూడా డిస్క్ బ్రేక్లు ఇవ్వబోతున్నారు. దీనివల్ల బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ మెరుగుపడుతుంది. కారు లోపల కొత్త కలర్ థీమ్, అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మెరుగైన సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ ఉంటాయని సమాచారం. ఇప్పటికే ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కారు కావడంతో, కొత్త ఫీచర్లు దీనికి మరింత బలాన్నిస్తాయి.

ఇంజిన్ పరంగా స్కోడా తన పాత శక్తివంతమైన ఇంజిన్లనే కొనసాగిస్తోంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఒక ముఖ్యమైన మార్పు జరగవచ్చు. సమాచారం ప్రకారం, 1.5 లీటర్ వేరియంట్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్‌ను తొలగించి, కేవలం DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. ఇది పక్కాగా లగ్జరీ రైడింగ్ ఇష్టపడే వారిని దృష్టిలో పెట్టుకుని చేసిన మార్పులా కనిపిస్తోంది. చిన్న ఇంజిన్ మోడళ్లలో మాత్రం మాన్యువల్ గేర్‌బాక్స్ కొనసాగవచ్చు.

Tags

Next Story