Loan : అప్పు తీసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలియకపోతే నష్టపోతారు.

Loan : అవసరానికి అప్పు పుట్టడం అనేది ఈ రోజుల్లో పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఏ అప్పు ఎప్పుడు తీసుకోవాలి, దేనివల్ల మనకు లాభం ఉంటుంది అనే అవగాహన లేకపోతే మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రకరకాల లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. గోల్డ్ లోన్, ప్రాపర్టీ లోన్, కార్ లోన్.. ఇలా ఏది తీసుకున్నా కొన్ని ప్రాథమిక నియమాలు తెలుసుకోవడం చాలా అవసరం. తద్వారా మనం కట్టే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.
ముందుగా గోల్డ్ లోన్ గురించి మాట్లాడుకుంటే.. ఇది తక్కువ కాలపరిమితి అవసరాలకు ఎంతో ఉపయోగకరం. మన దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి తక్షణమే నగదు పొందవచ్చు. సాధారణంగా ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి ఈ లోన్ ఇస్తారు. పర్సనల్ లోన్లతో పోలిస్తే దీనిపై వడ్డీ రేటు కొంత తక్కువగానే ఉంటుంది. మనం తీసుకున్న అప్పును పూర్తిగా చెల్లించగానే బ్యాంకులు మన నగలను భద్రంగా తిరిగి ఇచ్చేస్తాయి. అత్యవసరంగా డబ్బు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఇక మీ దగ్గర ఖాళీ స్థలం ఉండి, దానిపై ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే బ్యాంకులు కన్స్ట్రక్షన్ లోన్ ఇస్తాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన రూల్ ఉంది. ఆ స్థలం డాక్యుమెంట్లపై ఎవరి పేరు ఉందో, వారే లోన్ కోసం దరఖాస్తు చేయాలి. రిజిస్ట్రార్ ఆఫీస్ రికార్డుల్లో పేరు సరిగ్గా ఉంటేనే బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి. అలాగే, మనకు ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టి తీసుకునే ప్రాపర్టీ లోన్ అనేది పర్సనల్ లోన్ల కంటే చాలా చౌకగా ఉంటుంది. ఎందుకంటే బ్యాంకుకు ఇక్కడ ఆస్తి గ్యారెంటీగా ఉంటుంది కాబట్టి వడ్డీ తక్కువగా వసూలు చేస్తారు. ఈ లోన్ తీసుకునేటప్పుడు మనం కట్టగలిగే ఈఎంఐ రేటును బట్టి కాలపరిమితిని ఎంచుకోవడం మంచిది.
పాత కార్ల విషయానికి వస్తే.. కొత్త కారుపై కంటే సెకండ్ హ్యాండ్ కారు లోన్ పై వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. పాత కారు కొనేటప్పుడు కేవలం కారు కండిషన్ మాత్రమే కాదు, దాని ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ రికార్డులు పక్కాగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఫైనాన్స్ కంపెనీలు కూడా కారు ప్రస్తుత విలువను బట్టే లోన్ ఇస్తాయి. ఇక చివరగా ఒక ముఖ్యమైన చిట్కా.. మీకు ఒకటి కంటే ఎక్కువ అప్పులు ఉంటే, ముందుగా ఏ అప్పుపై వడ్డీ ఎక్కువగా ఉందో దాన్ని త్వరగా తీర్చేయండి. దీనివల్ల కాలక్రమేణా మీరు కట్టే వడ్డీ డబ్బులు చాలా వరకు ఆదా అవుతాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
