South Indian Bank : మహిళల కోసం సౌత్ ఇండియన్ బ్యాంక్ స్పెషల్ అకౌంట్..రూ.కోటి ఇన్సూరెన్స్ అంట.

South Indian Bank : మహిళా కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒక ప్రత్యేకమైన సేవింగ్స్ అకౌంట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు ఎస్ఐబీ హర్ అకౌంట్. ఈ ప్రత్యేక ఖాతాలో మహిళలకు అద్భుతమైన ఫీచర్లు, అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయి. భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ కవరేజ్, అన్-లిమిటెడ్ ఏటీఎం విత్‌డ్రాల నుంచి లాకర్ రెంట్‌పై డిస్కౌంట్ వరకు ఎన్నో సౌకర్యాలు ఈ SIB HER అకౌంట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్రత్యేకమైన సేవింగ్స్ ఖాతాలో మహిళలకు లభించే ప్రధాన ప్రయోజనాలు ఇవే
ఇన్సూరెన్స్ సౌకర్యాలు: విమాన ప్రమాద బీమా కింద రూ.కోటి వరకు కవరేజ్, వ్యక్తిగత ప్రమాద బీమా కింద రూ.లక్ష వరకు కవరేజ్ లభిస్తుంది. అలాగే, తక్కువ ప్రీమియంతో క్యాన్సర్ కేర్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది.
ఏటీఎం సౌకర్యం: ఏటీఎంల నుంచి ఎన్నిసార్లైనా, ఎంత డబ్బునైనా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఆర్థిక ప్రయోజనాలు: ఆటో స్వీప్ సౌకర్యం, తక్కువ వడ్డీ రేటుతో లోన్ సదుపాయం,లాకర్ అద్దె పై 50 శాతం తగ్గింపు లభిస్తుంది.
ఇతర సౌకర్యాలు: మహిళా కస్టమర్‌లు తమ కుటుంబ సభ్యులకు ఉచితంగా మూడు ఫ్యామిలీ అకౌంట్స్‌ను ఇందులో జత చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఎయిర్‌పోర్ట్ లాంజ్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.
ఆటో స్వీప్ ఫెసిలిటీ అంటే ఏంటి?
SIB HER అకౌంట్‌లో రూ.లక్షకు పైగా బ్యాలెన్స్ ఉంటే, ఆటో స్వీప్ ఫెసిలిటీ వర్తిస్తుంది. ఇది సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల మధ్య అనుసంధానం చేసే ఒక ప్రత్యేకమైన సదుపాయం. సేవింగ్స్ ఖాతాలో నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ డబ్బు ఉంటే, ఆ అదనపు మొత్తాన్ని ఆటోమేటిక్‌గా ఎఫ్డీ ఖాతాలోకి బదిలీ చేస్తారు. దీనివల్ల కస్టమర్‌కు సాధారణ సేవింగ్స్ వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఒకవేళ కస్టమర్‌కు సేవింగ్స్ ఖాతాలో డబ్బు అవసరమై, బ్యాలెన్స్ పరిమితి కంటే తగ్గితే, అవసరమైనంత డబ్బును ఎఫ్డీ ఖాతా నుంచి తిరిగి సేవింగ్స్ ఖాతాలోకి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఈ వ్యవస్థ వల్ల కస్టమర్ తమ డబ్బుపై అధిక వడ్డీని పొందే అవకాశం ఉంటుంది.
కనీస నెలవారీ బ్యాలెన్స్‌లో మినహాయింపు
సాధారణంగా SIB HER అకౌంట్‌లో రూ.50,000 కనీస నెలవారీ బ్యాలెన్స్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ నియమం నుంచి మినహాయింపు లభిస్తుంది. ఖాతాదారులు రూ.లక్ష మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెడితే, ఇకపై నెలవారీ కనీస బ్యాలెన్స్‌ను నిర్వహించాల్సిన అవసరం ఉండదు. లేదా, ఖాతాదారులు అంతకుముందు నెలలో ఈ అకౌంట్ డెబిట్ కార్డ్ ద్వారా రూ.50,000 ఖర్చు చేసినట్లయితే, ఆ నెలలో కనీస బ్యాలెన్స్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. సౌత్ ఇండియన్ బ్యాంక్‌లోని సాధారణ సేవింగ్స్ ఖాతాలలో కనీస బ్యాలెన్స్ రూ.5,000 వరకు ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

