Stock Market : నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్

దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు సూచీలను పడేశాయి. మరోవైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆయిల్ రిఫైనింగ్, పెయింట్స్ స్టాక్స్ మాత్రం రాణించడం గమనార్హం. సెన్సెక్స్ ఉదయం 82,101.86 పాయింట్ల (క్రితం ముగింపు 81,973.05) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,300.44 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. చివరికి 152.93 పాయింట్లంతో 81,820.12 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 70.60 పాయింట్ల నష్టంతో 25,057.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.04గా ఉంది.సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 73.35 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2669 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com