Stock Market : భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. ముఖ్యంగా ఎయిర్‌టెల్, రిలయన్స్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. దీంతో గురువారం సెషన్‌లో భారీ నష్టాలు చవిచూసిన సూచీలు.. ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. నిఫ్టీ 24,100 ఎగువన ముగిసింది.సెన్సెక్స్ ఉదయం 79,032.99 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,043.74) వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. తర్వాత కొనుగోళ్ల మద్దతుతో భారీ లాభాల్లోకి వెళ్లింది. ఇంట్రాడేలో 79,923.90 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 759.05 పాయింట్ల లాభంతో 79,802.79 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 216.95 పాయింట్ల లాభంతో 24,131.10 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.49గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.67 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2662 డాలర్ల వద్ద కొనసాగుతోంది.ఎన్ఎస్ఈ-50లో 43 స్టాక్స్ లాభాలతో స్థిర పడ్డాయి. భారతీ ఎయిర్ టెల్, సిప్లా, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్జూమర్ స్టాక్స్ 4.40 శాతం వరకూ లాభ పడ్డాయి. మరోవైపు పవర్ గ్రిడ్ కార్పొరేషన్, శ్రీరాం ఫైనాన్స్, హీరో మోటో కార్ప్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే ఇండియా 1.35 శాతం వరకూ నష్టపోయాయి. ఇదిలా ఉంటే రిలయన్స్ షేర్ 1.63 శాతం లాభంతో ముగిసింది.నిఫ్టీ మిడ్ క్యాప్ 0.16 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.75 శాతం వృద్ధి చెందాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు, నిఫ్టీ రియాల్టీ మినహా అన్ని ఇండెక్సులు లాభ పడ్డాయి. నిఫ్టీ ఫార్మా 2.35 శాతం, నిఫ్టీ హెల్త్ కేర్ 2.04శాతం లాభాలతో ముగిశాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com