TDS : మీ శాలరీ నుంచి కటింగ్స్ పెరుగుతున్నాయా? అయితే మీరు ఈ పెద్ద తప్పు చేసినట్టే.

TDS : ఉద్యోగస్తులకు ఏటా జనవరి నుంచి మార్చి వరకు ఒక రకమైన టెన్షన్ మొదలవుతుంది. చేతికి అందే జీతం ఒక్కసారిగా తగ్గిపోవడం, టీడీఎస్ రూపంలో భారీగా కోతలు పడటం చాలా మందిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా ఓల్డ్ టాక్స్ రిజీమ్(పాత పన్ను విధానం) ఎంచుకున్న వారికి ఈ కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అసలు జీతం నుంచి ఆదాయపు పన్ను కోతలు ఎందుకు పెరుగుతాయి? దీనికి ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్స్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో (ఏప్రిల్ లో) కంపెనీలు తమ ఉద్యోగుల నుంచి ఒక డిక్లరేషన్ తీసుకుంటాయి. అంటే.. ఆ ఏడాదిలో మీరు పీఎఫ్, బీమా, హోమ్ లోన్ వడ్డీ, హెచ్ఆర్ఏ వంటి వాటిల్లో ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారో ఒక అంచనా ఇవ్వాలి. దీని ఆధారంగా కంపెనీ మీ వార్షిక ఆదాయాన్ని లెక్కించి, నెలకు ఎంత పన్ను కట్టాలో డివైడ్ చేసి ప్రతి నెలా టీడీఎస్ కట్ చేస్తుంది. డిసెంబర్ వరకు అంతా సవ్యంగానే సాగుతుంది. కానీ, అసలు సినిమా జనవరిలో మొదలవుతుంది.
జనవరి నెల రాగానే కంపెనీలు మీరు ఏప్రిల్ లో చెప్పిన పెట్టుబడులకు సంబంధించిన అసలు పత్రాలను అడుగుతాయి. చాలా మంది ఏప్రిల్ లో రెండు లక్షల పెట్టుబడి పెడతామని చెప్పి, తీరా సమయం వచ్చేసరికి అంత సొమ్ము ఇన్వెస్ట్ చేయలేకపోతారు. ఉదాహరణకు మీరు 2 లక్షల పెట్టుబడి చూపిస్తామని చెప్పి, కేవలం లక్ష మాత్రమే ఇన్వెస్ట్ చేశారనుకోండి.. మిగిలిన ఆ ఒక లక్ష రూపాయలు మీ ఆదాయంలో కలిసిపోతాయి. దీనివల్ల పన్ను భారం పెరుగుతుంది. ఆ పెరిగిన పన్నును మిగిలిన మూడు నెలల (జనవరి, ఫిబ్రవరి, మార్చి) జీతం నుంచే రికవరీ చేయాల్సి రావడంతో టీడీఎస్ కోతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి.
పెట్టుబడి పెట్టినా ప్రూఫ్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి?
మీరు పెట్టుబడి పెట్టినా, ఆ పత్రాలను కంపెనీకి సమర్పించడంలో ఆలస్యం చేసినా టీడీఎస్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఇలాంటి వారు కంగారు పడాల్సిన పని లేదు. మీరు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఆ పెట్టుబడులను క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు అదనంగా కట్టిన పన్నును ప్రభుత్వం రీఫండ్ రూపంలో మీ ఖాతాలో వేస్తుంది. కానీ, ప్రస్తుతానికి మాత్రం చేతికి వచ్చే జీతం తగ్గిపోతుంది కాబట్టి, సకాలంలో ప్రూఫ్స్ ఇవ్వడమే ఉత్తమం.
కొత్త పన్ను విధానంలో ఈ బాధలు లేవు
న్యూ టాక్స్ రిజీమ్ (కొత్త పన్ను విధానం)లో పెట్టుబడులకు మినహాయింపులు ఉండవు. కాబట్టి అక్కడ ప్రూఫ్స్ అడిగే గొడవ ఉండదు. టీడీఎస్ కూడా దాదాపు ఏడాది పొడవునా స్థిరంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఓల్డ్ రిజీమ్ లో ఉంటే మాత్రం.. ఏప్రిల్ లోనే మీ పెట్టుబడులను పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. డిసెంబర్ కల్లా పెట్టుబడులు పూర్తి చేసి, జనవరిలో ప్రూఫ్స్ ఇచ్చేలా జాగ్రత్త పడాలి. అప్పుడు మాత్రమే ఆర్థిక సంవత్సరం చివరలో టీడీఎస్ షాక్ తగలకుండా తప్పించుకోవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

