Upcoming SUV in India: రాబోయే 3ఏళ్లలో మార్కెట్‌ను షేక్ చేయబోతున్న కొత్త ఎస్‌యూవీలు ఇవే.

Upcoming SUV in India: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా ఎస్‌యూవీల అమ్మకాలు సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్లను అధిగమించాయి. ప్రస్తుతం దేశీయ అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 50 శాతానికి పైగా ఉంది. వినియోగదారుల నుంచి పెరుగుతున్న ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీలు తమ దృష్టిని పూర్తిగా ఎస్‌యూవీ విభాగంపై కేంద్రీకరించాయి. ఇందులో భాగంగా రాబోయే మూడు సంవత్సరాలలో అనేక కొత్త, ఆసక్తికరమైన మోడళ్లను మార్కెట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
టయోటా ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే
టయోటా నుంచి రాబోయే ల్యాండ్ క్రూజర్ ఎఫ్‌జే మోడల్‌పై వినియోగదారుల్లో ఆసక్తి భారీగా ఉంది. ఈ ఎస్‌యూవీ 2028 పండుగ సీజన్ నాటికి భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ డీజిల్ ఇంజన్‌తో కాకుండా స్ట్రాంగ్ హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లతో మాత్రమే విడుదల కానుంది. దీని ధర సుమారు రూ.18 లక్షల నుండి రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ప్రారంభం కావచ్చు.
మహీంద్రా థార్ ఈవీ
సాహస ప్రియులను ఆకట్టుకున్న మహీంద్రా థార్ ఇప్పుడు కంప్లీట్ ఎలక్ట్రిక్ రూపంలో రాబోతోంది. మహీంద్రా సంస్థ ఆగస్టు 15, 2023 న దక్షిణాఫ్రికాలో Thar.e కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్ కూడా రాబోయే మూడు సంవత్సరాలలో భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ఆప్షన్స్‌తో పాటు, ఏడబ్ల్యుడి సిస్టమ్‌తో కూడిన డ్యూయల్ మోటార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
హ్యుందాయ్ 7 సీటర్ హైబ్రిడ్ ఎస్‌యూవీ
పెద్ద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని హ్యుందాయ్ ఒక కొత్త 7 సీటర్ ఎస్‌యూవీని తీసుకురానుంది. ఈ రాబోయే త్రీ-రో ఎస్‌యూవీ 2027 మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని తయారీ మహారాష్ట్రలోని తాలెగావ్ ఫ్యాక్టరీలో స్థానికంగా జరగవచ్చు. ఈ కారు హ్యుందాయ్ టక్సన్ కంటే పొడవుగా ఉండనుంది. ఇందులో 1.5 లీటర్ నాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ వెర్షన్ అందించే అవకాశం ఉంది.
రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ
భారతీయ మార్కెట్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్, కొత్త రూపంలో తిరిగి రాబోతోంది. రెనాల్ట్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. కొత్త డస్టర్ జనవరి 26, 2026 న భారత మార్కెట్‌లోకి తిరిగి వస్తుంది. రెనాల్ట్ నాలుగు సంవత్సరాల క్రితం, 2022లో ఈ ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేసింది. కొత్త డస్టర్ ఇంజన్ వివరాలు ఇంకా తెలియకపోయినా ఇది 1.3 లీటర్ టర్బోచార్జ్డ్ HR13 పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుందని అంచనా, ఇది 156bhp పవర్ ఉత్పత్తి చేయగలదు.
న్యూ హోండా ఈవీ
హోండా కూడా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో క్రెటా ఈవీ వంటి వాటికి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. హోండా 0 ఆల్ఫా ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఉత్పత్తి 2026 చివరి నాటికి రాజస్థాన్‌లోని తపుకారా ప్లాంట్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మారుతి ఇ-విటారా వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. టెక్నికల్ వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

