TARIFF: భారత్‌పై టారీఫ్‌లు అక్రమం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన 50 శాతం టారిఫ్‌లు ఇప్పుడు రాజకీయంగా, చట్టపరంగా తీవ్ర వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ టారిఫ్‌లను అక్రమమని పేర్కొంటూ అమెరికా కాంగ్రెస్‌లోని డెమొక్రాటిక్ చట్టసభ సభ్యులు బలమైన విమర్శలకు దిగారు. భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు బలంగా ఉన్న సమయంలో ఈ సుంకాలు రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీశాయని వారు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మహిళ నేత డెబోరా రాస్ మాట్లాడుతూ.. వాణిజ్యం, పెట్టుబడులు, శక్తివంతమైన భారతీయ-అమెరికన్ సమాజం ద్వారా నార్త్ కరోలినా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారతదేశంతో లోతుగా అనుసంధానమై ఉందని తెలిపారు. భారతీయ కంపెనీలు ఆ రాష్ట్రంలో ఒక బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయని, ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో వేలాది ఉద్యోగాలను సృష్టించాయని ఆమె హైలైట్ చేశారు.
అదే సమయంలో.. నార్త్ కరోలినా తయారీ సంస్థలు ఏటా వందల మిలియన్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను భారతదేశానికి ఎగుమతి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన టారిఫ్‌లు రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలకు కూడా నష్టం కలిగిస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. ఇదే అంశంపై కాంగ్రెస్ సభ్యుడు వీసీ స్పందిస్తూ.. భారతదేశం అమెరికాకు ముఖ్యమైన సాంస్కృతిక, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామి అని అన్నారు.ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయాలతో ఇబ్బంది పడుతున్న సాధారణ అమెరికన్లపై ఈ టారిఫ్‌లు అదనపు పన్నుల్లా మారాయని వ్యాఖ్యానించారు. ఈ అక్రమ సుంకాలు భారతదేశాన్ని మాత్రమే కాకుండా అమెరికా వినియోగదారులను కూడా నష్టపరుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మరింత ఘాటుగా స్పందిస్తూ.. భారతదేశం నుంచి వచ్చే వస్తువుల దిగుమతులపై విధించిన ఈ సుంకాలు సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తున్నాయని, అమెరికన్ కార్మికులకు హాని చేస్తున్నాయన్నాయన్నారు. ఈ సుంకాలు వినియోగదారుల ఖర్చులను పెంచుతున్నాయని ఆయన హెచ్చరించారు. ఈ విధమైన చర్యలు అమెరికా ప్రయోజనాలను గానీ, భద్రతను గానీ ముందుకు తీసుకెళ్లవని అన్నారు. ఈ సుంకాలను ముగిస్తే అమెరికా-భారత్ మధ్య ఆర్థిక, భద్రతా సహకారం మరింత బలోపేతం అవుతుందని కృష్ణమూర్తి గట్టిగా నొక్కి చెప్పారు. ట్రంప్ పరిపాలన ఆగస్టు 27 నుంచి భారత దిగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచడమే కాకుండా, రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లపై 25 శాతం అదనపు టారిఫ్‌లను కూడా విధించింది. భారతదేశం రాయితీ ధరకు రష్యన్ చమురును కొనుగోలు చేయడమే ఈ చర్యలకు కారణమని ట్రంప్ ఆరోపించారు. మాస్కోతో భారత వాణిజ్య సంబంధాలు ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయన్నది ఆయన వాదన. అయితే ఈ నిర్ణయాలతో న్యూఢిల్లీ-వాషింగ్టన్ మధ్య సంబంధాలు తీవ్రంగా క్షీణించాయి. దీనిని సరిదిద్దేందుకు డెబోరా రాస్, వీసీ, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా సహా 19 మంది డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యులు ట్రంప్‌కు లేఖ రాసి.. భారతదేశంపై విధించిన టారిఫ్‌లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు ఉన్న రాజ్యాంగబద్ధమైన వాణిజ్య అధికారాలను తిరిగి పొందడమే ఈ ప్రయత్నమని వారు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

